యాదాద్రి పవర్ ప్లాంట్ పాపం ఎవరిది?

08-10-2026 | 05:30am
  1. యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు లింకేజీపై ముందుచూపు లేని నిర్ణయం
  2. అందుబాటులో లేని జీ9 బొగ్గు సరఫరాకు హామీ ఎలా ఇచ్చారు?
  3. సింగరేణి బొగ్గుబ్లాకుల వైఫల్యాలపై ఆధారాలున్నాయి
  4. హరీశ్‌రావు విమర్శలు వాస్తవాలను కప్పిపుచ్చలేవు
  5. పవర్ సెక్టార్‌ను ప్రైవేటీకరించం: డిప్యూటీ సీఎం భట్టి

అక్టోబర్ 7 (విజయక్రాంతి): యాదాద్రి పవర్ ప్లాంట్(Yadadri Power Plant) ఆలస్యా నికి గత పాలకుల తప్పిదమే కారణమని, యాదాద్రి పవర్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు కేటాయింపులు, సరఫరా లింకేజీలను(Coal allocations and supply linkages) ముందుగానే నిర్ధారించకుండా ప్లాంట్ నిర్మా ణం చేపట్టారని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు. రాష్ట్ర విద్యుత్ రంగం(State Power Sector)పై, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు(Harish Rao) చేస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

పదేళ్లు అధికారంలో ఉన్నవారు చేసిన తప్పిదాలను చెప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నామని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. అవసరమైన బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత వస్తుంది? నాణ్యత ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకుండానే యాదాద్రి ప్లాంట్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. వీటి ఆధారాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మా ట్లాడారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరిందని తెలిపారు.

దాదాపు 20 వేల మెగావాట్ల డిమాండ్ పెరిగినప్పటికీ కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లలోపే ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 వేల మెగావాట్లుగా ఉందని వివరించారు. విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగినా నిరంతరాయంగా విద్యుత్ సరాఫరాకు కృషి చేస్తున్న జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల అధికారులు, సిబ్బందిని ప్రశంసించాల్సింది పోయి కొందరు నాయకులు త ప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కోను ప్రైవేటీకరించబోతున్నామనే వాదనలను ఖండించారు. ‘పవర్ సెక్టార్‌ను అమ్మేయాలన్న ఆలోచన, చర్చ అసలు లేదు. మేము ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని బలంగా విశ్వసిస్తున్నాం. ఎవరికివారు ఊహించుకుని, ఆ ఊహల ఆధారంగా విమర్శలు చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.

యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు ఎక్కడిది?

గత పాలకుల హయాంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి 2015 ఫిబ్రవరి 16న ఎల్‌ఓఐ ఇచ్చారని భట్టి తెలిపారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి  అత్యంత కీలకమైన అంశం బొగ్గు, సరఫరా లింకేజీ అని చెప్పారు. అయితే, 2016 ఏప్రిల్ 20న సింగరేణి కాలరీస్, టీఎస్ జెన్‌కో మధ్య కుదిరిన ఒప్పందంలో యాదాద్రికి అవసరమైన 14 మిలియన్ టన్నుల బొగ్గు విషయంలో 7 మిలియన్ టన్నులు మాత్రానికే అంగీకారం కుదుర్చుకున్నారని తెలిపారు. అదే ఏడాది డిసెంబర్ 9న ఎంఎస్టీసీతో మరో ఒప్పందం చేసుకుని మిగిలిన 50 శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారని చెప్పా రు.

యాదాద్రి ప్లాంట్‌కు ఏడాదికి సుమారు 7 మిలియన్ టన్నుల దిగుమతి బొగ్గును సరఫరా చేసేందుకు ఎంఎస్టీసీ అంగీకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా దిగుమతి బొగ్గును రవాణా చేసేందుకు రైల్వే శాఖకు కూడా లేఖలు రాశారని తెలిపారు. అయితే ఆ ఒప్పందాలు అమలు కాలేదని, చివరకు 2022 ఏప్రిల్ 27న యాదాద్రికి అవసరమైన మొత్తం 14 మిలియన్ టన్నుల బొగ్గును సింగరేణి నుంచే సరఫరా చేస్తామని మరో అవగాహన ఒప్పందం చేసుకు న్నారని చెప్పారు.

2022-23 నాటికి సింగరేణిలో జీ-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 1.71 మిలియన్ టన్నులు మాత్రమే ఉందని తెలిపారు. అలాంటప్పుడు యాదా ద్రి ప్లాంట్‌కు ఏడాదికి 14 మిలియన్ టన్ను ల బొగ్గును ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. ‘బొగ్గు కేటాయింపులు లేకుండానే పవర్ ప్లాంట్ నిర్మిస్తారా? బొగ్గు లేకపోతే ప్లాంట్ ఎలా నడుస్తుంది? ఈ అంశంపై హరీశ్రావు ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని భట్టి డిమాండ్ చేశారు.

బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొననే లేదు!

యాదాద్రికి అవసరమైన బొగ్గును సమకూర్చడంతో పాటు రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి ని పెంచేందుకు కొత్త బొగ్గు బ్లాకులను సాధించే విషయంలో గత పాలకులు నిర్లక్యంగా వ్యవహరించారని భట్టి విమర్శిం చారు. కొత్త బొగ్గు బ్లాకులు అందుబాటులోకి తీసుకురాకపోయినా సింగరేణి తన పరిధిలో ఉత్పత్తిని పెంచిందని తెలిపారు. 2014-15లో 52.66 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఉండగా.. 2025-26లో 62.07 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, డిస్పాచ్ సాధించిందని చెప్పారు.

బొగ్గు బ్లాకులు తగ్గినప్పటికీ సింగరేణి తన వంతుగా చేయాల్సిందంతా చేస్తూ ఉత్పత్తిని పెంచిందని వివరించారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల నుంచి బొగ్గు రవాణా కోసం గత పాలకులు 2016 డిసెంబర్ 7న లేఖ రాసి, ఆ తర్వాత రవాణా ఏర్పాట్లను పూర్తిగా వదిలేశారని ఆరోపించారు. బొగ్గు అవసరాలను ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే యాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం నిర్వర్తించలేదన్నారు. 

గత పదేళ్ల పాలనలో సింగరే ణికి అందుబాటులో ఉన్న బొగ్గు బ్లాకులను కాపాడుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని భట్టి విమర్శించారు. కొత్త బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణిని పాల్గొనకుండా పక్కన పెట్టారని ఆరోపించారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా అలానే చేశారని అన్నారు. యాదాద్రికి ప్రత్యేకంగా కోల్ అలాట్‌మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంద న్నారు. ఇందుకోసం కోల్ ఇండియా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కమిటీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తమ ప్రభుత్వం లేఖలు రాసినట్లు తెలిపారు. 

గత ప్రభుత్వ తప్పిదాలే కారణం..

యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల వినియోగదారులపై పడుతున్న ఆర్థిక భారాన్ని భట్టి వివరించారు. యాదాద్రి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6.66 గా ఉందని తెలిపారు. అదే కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి యూనిట్‌కు రూ.4.17, భద్రాద్రి థర్మల్  ప్లాంట్ నుంచి సుమారు రూ.4.60- రూ.5.10 పరిధిలో విద్యుత్ లభిస్తోందని చెప్పారు. ‘యాదాద్రి విద్యుత్ ధర ఎక్కువగా ఉండటంతో ఆ భారాన్ని ఎవరు మోస్తారు? వినియోగదారులే కదా. ప్రజలపైనే ఆ భారం పడుతుంది.

ఈ పాపం గత పాలకులదే’ అని అన్నారు. ప్లాంట్ జీవితకాలం సుమారు 25 సంవత్సరాలు ఉండ టంతో దీర్ఘకాలికంగా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండేళ్లు ఆలస్యమవడానికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను వేగవంతం చేసి యూనిట్లను వరుసగా కమిషన్ చేస్తున్నామని చెప్పారు. యాదాద్రి ప్లాంట్‌కు సరిపడా బొగ్గు కేటాయింపులు లేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాల్లో సమీకరిస్తున్నామని తెలిపారు.

ఈ వాస్తవాలను విస్మరించి.. తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని భట్టి మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాం ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి డాక్యుమెంటరీ ఆధారాలతో సమాధానం ఇస్తామని ప్రకటించారు. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే  లక్ష్యమని, రాజకీయ విమర్శల కోసం విద్యుత్ సంస్థ లు, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రజల్లో అపోహలు సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదని సూచించారు. 

మరిన్ని వార్తలు