హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కల్తీ పాలు

07-11-2026 | 05:15am
  1. పోచారంలో దందా
  2. ఎస్‌వోటీ బృందం దాడి

ఇబ్రహీంపట్నం, నవంబర్ 6  (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో కల్తీపాల దందా మరోకటి బయటపడింది. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో కల్తీపాల కేంద్రం గుట్టురట్టయింది. పక్కా సమాచారం మేరకు మహేశ్వరం జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌వోటీ)(Maheshwaram Zone Special Operations Team) ఆ కేంద్రంపై దాడి చేసింది. పాలు కల్తీ చేస్తున్నట్లు గుర్తించింది.దోల్పూర్ పాలపొడిలో హైడ్రో జన్ పెరాక్సైడ్ అనే రసాయన ద్రావ కం కలిపి పాలను తయారు చేస్తున్నట్లు పసిగట్టింది. నిర్వాహుకుడు అండె శ్రీశైలంను అదుపులోకి తీసుకుంది.

ఈ పాలను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు విచారణలో అధికారులు తెలుసుకున్నారు. అప్పటికే కల్తీ చేసిన 100 లీట ర్ల పాలను, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం, 35 కిలోల దోల్పూరు పాలపొడి ప్యాకెట్లు స్వా ధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలపై నిందితుడిని, అలాగే స్వాధీనం చేసుకున్న సరుకును ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. కల్తీ ఆహార పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎస్‌వోటీ, ఫ్యూచర్ సిటీ పోలీసులు సూచించారు. అనుమానాస్పదమైన సరుకులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.  

100 లీటర్ల కల్తీ పాలు,సరఫరాకు సిద్ధంగా ఉన్న నకిలీ పాలు,

1 లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలు పాడవకుండా నిల్వ కాలం పెంచేందుకు వాడే ప్రమాదకర రసాయనం,35 కిలోల ధోల్పూర్ పాలపొడి,పాలలో చిక్కదనం మరియు ఫ్యాట్ శాతం పెంచడానికి ఉపయోగించే పొడి ప్యాకెట్ల ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు శ్రీశైలం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించేందుకు పాలపొడి మరియు రసాయనాలు కలిపి కృత్రిమ పాలు తయారు చేసి, ప్రతిరోజు ఉదయాన్నే హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిపై ఆహార కల్తీ నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసి ఇబ్రహీంపట్నం పిఎస్కు అప్పగించారు.

జిల్లాలో పుట్టగొడుగుల్లా కల్తీ కేంద్రాలు.....

గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో కల్తీ పాల దందా మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతోంది.ఇటీవల కడ్తాల్ మండలం రావిచెడులో రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యాపారి అరెస్ట్,అబ్దుల్లాపూర్ మెట్భారీగా డెటర్జెంట్లు, సింథటిక్ పాలు స్వాధీనం,షాద్ నగర్ లో పాలపొడి, యూరియాతో పాలు తయారు చేస్తున్న ముఠా ను పోలీసులు గుట్టురట్టు చేశారు.

కల్తీ దందాకు ప్రధాన కారణాలు విశ్లేషిస్తే....

ఎల్ నినో ప్రభావం... తో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పశుగ్రాసం ధరలు పెరిగి, ఆవులు-గేదెల పాల దిగుబడి గణనీయంగా తగ్గింది.హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న పాల డిమాండ్ను సాధారణ పాడి రైతులు డిమాండ్ కు సరిపడి పాల ఉత్పత్తులను అందించలేకపోతున్నారు.అక్రమార్కులు ఈ కొరతను ఆసరాగా చేసుకుని కృత్రిమ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు.

శరీర అవయవాలపై కోలుకోలేని దెబ్బ...

హైడ్రోజన్ పెరాక్సైడ్, డెటర్జెంట్లు, నిల్వ ఉంచే రసాయనాలతో తయారుచేసే కల్తీ పాలు తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన కడుపునొప్పి, అల్సర్లు, మరియు వాంతులు వస్తాయని,రసాయనాలు క్రమంగా శరీరంలో చేరడం వల్ల మూత్రపిండాలు (కిడ్నీలు), కాలేయం (లివర్) పాడయ్యే ప్రమాదం ఉంది.పసిపిల్లలలో రోగనిరోధక శక్తి తగ్గి నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కల్తీ రాయుళ్లపై ‘పీడీ యాక్ట్’ మోపాలి....

ప్రతిరోజూ మన ఇంటి వద్దకే వచ్చి పాలు పోసే వ్యాపారులే ఇలా కాసుల కక్కుర్తికి పాల్పడటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సాధారణ కేసులు పెట్టి వదిలేయకుండా, ఇలాంటి అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారిపై ఉపేక్షించేది లేదని ఫ్యూచర్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. 

మీ పరిసర ప్రాంతాలలో అనుమానాస్పదంగా కల్తీ పాలు లేదా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు