ఇంటింటికీ ఇంటర్నెట్

07-11-2026 | 05:25am

అమెండెడ్ భారత్ నెట్ కార్యక్రమానికి కేంద్రంతో రాష్ట్రం ఒప్పందం

  1. రూ. 3,185 కోట్ల ఆర్థిక సాయం మంజూరు
  2. 12,769 జీపీలకు రింగ్ టోపాలజీలో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ 
  3. 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యం
  4. ఒక్కో కనెక్షన్‌కు రూ.10 వేల వరకు ఆర్థిక సహాయం
  5. ట్రైసిల్ ద్వారా అమెండెడ్ భారత్ నెట్ అమలు
  6. సీఈవోగా టీహాఫైబర్ ఎండీ వేణు ప్రసాద్

నవంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. గ్రామీణ ప్రాంతాలకు అత్యాధునిక బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి(Central Government's Digital Bharat Fund) (డీబీఎన్), టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్న అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్(ఏబీపీ) కింద రాష్ట్రానికి రూ. 3,185 కోట్ల ఆర్థిక సహాయం మంజూరైంది.

ఈ మేరకు శుక్రవా రం ఢిల్లీలోని సంచార్ భవన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి సంతకం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. ఇప్పటికే రింగ్ టోపాలజీలో పనిచేస్తున్న 10,787 గ్రామ పంచాయతీలతోపాటు, ప్రస్తుతం లీనియర్ టోపాలజీలో ఉన్న 1,946 గ్రామ పంచాయతీలను రింగ్ టోపాలజీకి అప్‌గ్రేడ్ చేయనున్నారు.

మరో 36 గ్రామ పంచాయతీల్లో కొత్తగా రింగ్ టోపాలజీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన, నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు అవకాశం కలగనుంది. కార్యక్రమంలో డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ప్రతినిధులు, తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఆర్‌ఐఐసీఎల్), టీ-ఫైబర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, గౌరవ్ ఉప్పల్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చివరి మైలు కనెక్టివిటీ (లాస్ట్ మైల్ కనెక్టివిటీ)కి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సుమారు 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు అందించేందుకు ఒక్కో కనెక్షన్‌కు సుమారు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

ఇందుకోసం సుమారు రూ. 300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్లకు నేరుగా ఇంటర్నెట్ సేవలు చేరువ కానున్నాయి. అమెండెడ్ భారత్‌నెట్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ‘తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైసిల్)’ ద్వారా అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రత్యేక సంస్థగా ట్రైసిల్‌ను 2026 జూన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు టీఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ సీఈవోగా వ్యవహరించనున్నారు.

జిల్లా, మండల కేంద్రాల వరకు నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను టీ- నిర్వహించనుండగా, ఆ తర్వాత మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీల వరకు భారత్ నెట్ నెట్ వర్క్ అమలు, నిర్వహణ బాధ్యతలను ట్రైసిల్ చేపట్టనుంది. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్త ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్‌సీ) నెట్‌వర్క్ ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు కూడా అనుమతి లభించింది. ఈ నెట్‌వర్క్ నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలను పదేండ్లపాటు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. భారత్‌నెట్ మౌలిక సదుపాయాలను వాణిజ్యపరంగా వినియోగించుకుని ఆదాయం సమకూర్చుకునేందుకు నెట్‌వర్క్ మానిటైజేషన్ ప్రక్రియకు కూడా అనుమతి లభించింది. 

విద్య, వైద్యం, వ్యవసాయానికి డిజిటల్ సేవలు 

ప్రాజెక్టు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ సేవలు మరింత విస్తరించనున్నాయి. రైతు వేదికలతో పాటు వివిధ ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు చేరవేయడం సులభతరం కానుంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా పట్టణ ప్రాంతాలతో సమానంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని డిజిటల్ ఇండియా లక్ష్యాలకు తగ్గట్టు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తెలంగాణలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. మొత్తంగా రూ. 3,185 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమం తెలంగాణలో గ్రామీణ ఇంటర్నెట్ విస్తరణకు కొత్త దిశానిర్దేశం చేయనుంది. ట్ర్తీ-ఫైబర్, ట్రైసిల్ సమన్వయంతో గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా గృహాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తరించేందుకు మార్గం సుగమమైంది.

 

మరిన్ని వార్తలు