లోక్ అదాలత్ లో సత్వర న్యాయం
- రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్
- రంగారెడ్డి జిల్లా కోర్టులో రూ.10 కోట్ల ఎన్ఐ యాక్ట్ కేసుకు పరిష్కారం
ఎల్బీనగర్, నవంబర్ 21 : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(Telangana State Legal Services Authority) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రంగారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు(District Court), మండల కోర్టుల ప్రాంగణాల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం (ఎన్ఐ యాక్ట్(NI Act)) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్‌ను(Lok Adalat) విజయవంతంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా సెషన్స్ జడ్జి ఎ.కర్ణ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు.
లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు సులభతరమైన, వేగవంతమైన, ఉచిత న్యాయ సేవలు(Free Legal Services) అందించడంతోపాటు సమయం, ధనం ఆదా అవుతుందన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్‌లో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 252 కేసులు పరిష్కారమై, రూ.13,50,68,077 పరిహారాన్ని బాధితులకు అందజేశారు. ఎల్బీనగర్లోని రెండోవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న 2025 కాలానికి సంబంధించిన ఎన్ఐ యాక్ట్ కేసులో ఇరుపక్షాల మధ్య రాజీ కుదరడంతో రూ.10 కోట్ల మొత్తానికి పరిష్కారం లభించింది.
అదేవిధంగా, వ్యాజ్య దశలో ఉన్న (ప్రీ-లిటిగేషన్) కేసులో ఇరుపక్షాల మధ్య రాజీ కుదరడంతో రూ.1 కోటి 50 లక్షల మొత్తానికి పరిష్కారం లభించింది. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెద్ద మొత్తంలో ఆర్థిక వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారం అయ్యాయి. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.