వనస్థలిపురంలో చేపల మార్కెట్ నిర్మించాలి
- తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహా
ఎల్బీనగర్, నవంబర్ 21 : వనస్థలిపురంలో(Vanasthalipuram) స్థలం కేటాయించి, రూ.50 లక్షలతో నూతన చేపల మార్కెట్ నిర్మించాలని, చేప పిల్లల స్కీమ్ నగదును మత్స్య సొసైటీ అకౌంట్ లో జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం(Telangana Fishermen and Fish Workers' Union) రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహా డిమాండ్ చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం వనస్థలిపురం రైతు బజార్ చేపల మార్కెట్ వద్ద తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గోరెంకల నర్సింహా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం రూ.116 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఇప్పటికీ ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. మత్స్యశాఖ లో అవినీతికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి మత్స్య సొసైటీ బ్యాంకు అకౌంట్ లో నగదు జామ చేయాలని, 986 మంది మత్స్యకారులు మృతి చెందారని, వారికి ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషియో వెంటనే ఇవ్వాలని కోరారు.
మత్స్య మిత్ర మహిళా గ్రూపులను పునరుద్ధరించాలని, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయాలన్నారు. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ.. వనస్థలిపురం రైతు బజార్ వద్ద 1000 గజాల స్థలం కేటాయించి, రూ.50 లక్షలతో నూతన చేపల మార్కెట్ నిర్మించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు తడబోయిన కృష్ణ మూర్తి, సౌళ్ళ లలిత, మార్కెట్ కమిటీ కోశాధికారి మెంగ సైదులు, ఉపాధ్యక్షుడు రసమళ్ళ యాదగిరి, ఉపాధ్యక్షురాలు కుమారి, గంగ, నాయకులు మహేశ్, కుద్వదిన్, శ్రీను, రవి, సుబ్బారావు, అర్జున్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.