అర కిలోమీటరు రోడ్డుకు అష్టకష్టాలు!
- అల్గోల్ దారికి మోక్షమెన్నడు?
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
- నిత్యం వందలాది వాహనదారులకు నరకయాతన
- వినాయక నిమజ్జనం వేళ మాత్రమే మట్టితో తాత్కాలిక మరమ్మతులు
జహీరాబాద్, నవంబరు 13: జాతీయ రహదారి-65(National Highway-65) నుండి అల్గోల్ వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. కేవలం అర కి లోమీటరు మాత్రమే ఉన్న ఈ రహదారికి మోక్షం ఎప్పుడు లభిస్తుం దా అని స్థానిక ప్రజలు, వాహనదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ రహదారి మీదుగా ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ముఖ్యంగా అల్లానా కంపెనీ, బీదర్తో పాటు అల్గోల్, పొట్టిపల్లి, ఎల్గోయి తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఇదే ప్రధాన మార్గం. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, స్కూల్ బస్సులు మరియు బీదర్ వెళ్లే భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
నిమజ్జనం వేళ మాత్రమే హడావుడి..
రోడ్డు నిర్మాణం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏడాదికొకసారి వినాయక నిమజ్జనం సమయంలో విగ్రహాలను నారింజ ప్రాజెక్టుకు తరలించేటప్పుడు మాత్రమే అధికారులు హడావుడిగా మట్టి పోసి గుంతలు పూడుస్తున్నారని, ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కేవలం అర కిలోమీటరు రోడ్డును కూడా బాగు చేయక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.