మాదారంలో పరిశ్రమల ఇష్టారాజ్యం..?

11-11-2026 | 11:16am

జిన్నారం, నవంబర్ 11 (విజయ క్రాంతి): గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో పరిశ్రమల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలోని సంగం కుంటలో పరిశ్రమల వ్యర్థాలను అక్రమంగా డంపింగ్ (Industrial Waste Dumping) చేసి, అనంతరం వాటికి నిప్పంటించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

వ్యర్థాలకు నిప్పంటించడంతో వెలువడుతున్న విషపూరిత పొగతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) అధికారులు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. సంగం కుంటలో వ్యర్థాల డంపింగ్‌పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా పీసీబీ అధికారులు స్పందించి మాదారం గ్రామంలో తనిఖీలు చేపట్టి పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తారా? లేక పరిశ్రమల కార్యకలాపాలపై చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉంటారా? అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు