నియంత్రణ లేని నిమ్జ్ రహదారి!

19-11-2026 | 05:15am
  1. తగ్గని వాహనాల వేగం.. 
  2. మృతి చెందుతున్న మూగజీవాలు
  3. రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా రహదారి వెలగని విద్యుత్ దీపాలు.. 
  4. పట్టించుకోని అధికారులు
  5. తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి

ఝరాసంగం, నవంబర్ 18: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం(Zaheerabad Constituency)లోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్ ) కోసం సుమారు రూ.100 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన రహదారిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిర్వహణ లోపం.. చీకట్లో రాకపోకలు..

గత ఏడాది మే 23న జహీరాబాద్లో జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రహదారిని ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత నిర్వహణపై అధికారులు దృష్టి సారించడం లేదు. హుగ్గెల్లి నుంచి కృష్ణాపూర్, మాచునూర్ క్రాస్ రోడ్డు వరకు డివైడర్ మధ్యలో నాటిన మొక్కలు సరైన సంరక్షణ లేక ఎండిపోయాయి. మాచునూర్ నుంచి బర్దిపూర్ శివారు వరకు డివైడర్ నిండా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి.

అతివేగంతో ప్రమాదాల ముప్పు..

రహదారిపై భారీ వాహనాలు నియంత్రణ లేకుండా అతివేగంగా దూసుకెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనాలు ఢీకొని పలు మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. భారీ వాహనాల వేగానికి చిన్న వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు, రాత్రివేళల్లో పోలీసు పెట్రోలింగ్ లేకపోవడంతో రహదారి పక్కన మద్యం సేవించే వారికి ఇది అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెలగని వీధి దీపాలు..

రహదారిపై సుమారు 420 విద్యుత్ దీపాలు, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ రాత్రివేళల్లో అవి వెలగడం లేదు. దీంతో రుక్మాపూర్, ముంగి, హద్దూర్, న్యాల్కల్, చిలేపల్లి, చిలేపల్లి తండా, బర్దిపూర్, ఎల్గోయి, పొట్టిపల్లి తదితర గ్రామాల ప్రజలు చీకట్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. డివైడర్లోని పిచ్చిమొక్కలను తొలగించి, వాహనాల వేగాన్ని నియంత్రించేలా స్పీడ్ బ్రేకర్లు లేదా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే, రాత్రివేళల్లో పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు