కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవలు స్ఫూర్తిదాయకం
హత్నూర, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన హైదరాబాద్ తొలి మేయర్(First Mayor) కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను కొనసాగించాలని ముదిరాజ్ సంఘాల(Mudiraj Associations) నాయకులు పిలుపునిచ్చారు. హత్నూర మండలం దౌల్తాబాద్‌లో శుక్రవారం కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ.. కృష్ణస్వామి ముదిరాజ్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఉద్యమిస్తూ విద్య, పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం సాధనకు పాటుపడిన ఆయన.. విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించినప్పుడే హక్కులను సాధించగలమనే చైతన్యాన్ని ప్రజల్లో కల్పించారని తెలిపారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు గున్నాల నర్సింలు, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, కొన్యాల వెంకటేశం, కొన్యాల సతీష్, సుజాత సత్యం, కిష్టయ్య, రవికుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






