కరెంటు బిల్లుల్లో ‘ట్రూ అప్’ షాక్..!
- వినియోగదారుడి జేబులకు డిస్కంల చిల్లు
- రెండున్నరేళ్ల పాటు సామాన్యుడిపై మోత
కంగ్టి, నవంబర్ 10 : తెలంగాణ రాష్ట్ర(Telangana State) వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడటం ప్రారంభమైంది. గతంలో ఎప్పుడో వాడిన విద్యుత్తుకు ‘ట్రూ అప్’ ఛార్జీల పేరిట నవంబర్ నెల నుంచే కరెంటు బిల్లుల్లో విద్యుత్ శాఖ(Electricity Department) వసూళ్లను మొదలుపెట్టింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు డిస్కంలు ఈ భారాన్ని ప్రజలపై మోపుతున్నాయి.
వ్యవసాయేతర వినియోగదారుల నుంచి ఏకంగా రూ. 5,420.23 కోట్ల బకాయిలను రాబట్టేందుకు ఈ బాదుడుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. నవంబర్ బిల్లుల్లో యూనిట్‌కు 30 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తుండగా, వచ్చే డిసెంబర్ నుంచి ఈ భారం యూనిట్‌కు 50 పైసలకు పెరగనుంది. ఈ వడ్డన సుమారు రెండున్నరేళ్ల పాటు (డిస్కంను బట్టి 26 నుంచి 29 నెలల వరకు) కొనసాగుతుండటంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోనున్నారు.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల నాటి విద్యుత్ వినియోగ వ్యత్యాసాల బకాయిలను ఇప్పుడు వసూలు చేస్తున్నారు. నగరాల్లో తరచూ ఇళ్లు మారే అద్దెదారులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. నాలుగేళ్ల క్రితం ఆ ఇళ్లలో ఎవరో వాడిన కరెంటు బిల్లులకు, ఇప్పుడు కొత్తగా చేరిన అద్దెదారులు భారీగా జరిమానా లాంటి ట్రూ అప్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది.
సాధారణ ఇళ్లపై వందల రూపాయల భారం..
ట్రూ అప్ ఛార్జీల మోత వల్ల సాధారణ ఇండ్లపై వందల్లో భారం పడనుంది. ఉదాహరణకు ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉపయోగిస్తే, నవంబర్ నెల బిల్లులో రూ. 60 అదనంగా వస్తుంది. అదే డిసెంబర్ నుంచి ప్రతి నెలా రూ. 100 చొప్పున దాదాపు రెండున్నరేళ్ల పాటు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
సామాన్య గృహ వినియోగదారులకే కాకుండా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లకు ఈ ట్రూ అప్ ఛార్జీలు షాక్ ఇస్తున్నాయి. ఐటీ కారిడార్ పరిధిలోని కొన్ని పెద్ద సొసైటీలకు మొదటి నెలలోనే లక్షల్లో ట్రూ అప్ బిల్లులు రావడం నివాసితులను ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్ధిదారులకు ఈ ట్రూ అప్ ఛార్జీల నుండి మినహాయింపు లభించింది. అయితే ఒకవేళ ఏ నెలలోనైనా వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం, ఆయా కుటుంబాలు కూడా సాధారణ బిల్లుతో పాటు ఈ ట్రూ అప్ భారాన్ని అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 12.49 లక్షల గృహాలపై భారం..
ట్రూ ఆప్ ఛార్జీల వడ్డన వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో 12.49 లక్షల గృహాలపై అదనపు భారం పడనుంది. పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఉండే సంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 6,30,652 గృహ కనెక్షన్లు ఉన్నాయి. ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉండే అమీన్పూర్, పటాన్చెరు, రామచంద్రాపురం పరిధిలోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు ఈ బిల్లుల మోత గట్టిగా తగలనుంది. సిద్దిపేట జిల్లా పరిధిలో 3,73,346 గృహ కనెక్షన్లు, అలాగే 3,850 పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో దాదాపు 2,40,174 గృహ విద్యుత్ కనెక్షన్లు (మొత్తం కనెక్షన్లు 3.55 లక్షలు) ఉన్నాయి. వర్షాలు సరిగ్గా లేక ఇప్పటికే కరెంట్ వాడకం పెరిగి బిల్లులు ఎక్కువగా వస్తున్న తరుణంలో ఈ అదనపు బాదుడు సామాన్యుడి నడుం విరుస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.