ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

14-10-2026 | 06:21pm

గజ్వేల్, అక్టోబర్ 14: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) గజ్వేల్ పట్టణంలోని ఐఎంఏ భవనంలో వైభవంగా జరిగాయి. భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ)(Indian Medical Association) గజ్వేల్ శాఖ మహిళా వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వైద్యుల కుటుంబ సభ్యులు ఆటపాటలతో సందడి చేశారు.

వివిధ రకాల పూలతో సృజనాత్మకంగా రూపొందించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రబోధాత్మక బతుకమ్మలకు బహుమతులు అందజేయడంతో పాటు తెలంగాణ పండుగల విశిష్టతపై నిర్వహించిన క్విజ్‌ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ పద్మజ్యోతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు వైద్యుల కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందించేందుకు గత ఏడాది నుంచి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డాక్టర్ పెంటాచారి మాట్లాడుతూ పూలనే బతుకమ్మ దేవతగా భావించి పూజించడం తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేకత అని కొనియాడారు. సామూహిక ఉత్సవాలు సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తాయని డాక్టర్ నరేశ్ బాబు పేర్కొన్నారు. స్వదేశీ భావన, సామాజిక సమరసత, పౌర విధుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణతో పాటు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు శైలజ, మంజుల, సుజాత, స్రవంతి, గీత, శ్రీలత, మాధవి, సమీక్ష, అఖిల, హైమావతి, ప్రశాంతి, రచన, జ్యోతిర్మయి, రమాదేవి, పద్మావతి, నరేశ్ బాబు, పెంటాచారి, మల్లయ్య, సద్గుణాచారి, లింగం, నాగమునెయ్య, సాయినాథ్ రెడ్డి, రాజేశ్ కుమార్ తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు