బాలికలు తమ హక్కులు, రక్షణపై అవగాహన కలిగి ఉండాలి

14-10-2026 | 07:28pm

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత..

హనుమకొండ, అక్టోబర్ 14 (విజయక్రాంతి): బాలికలు తమ హక్కులు, రక్షణపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత(Police Commissioner N. Shweta) అన్నారు. వరంగల్ జిల్లా షీ టీమ్స్ ఆధ్వర్యంలో బాలికల భద్రత, మహిళా రక్షణ, వ్యక్తిగత అభివృద్ధి, సైబర్ నేరాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు హనుమకొండ లోని బాలసముద్రం లోని కాళోజీ కళాక్షేత్రంలో  షీ  టీమ్స్ ఎసిపి సదయ్య  నేతృత్వంలో బాలికా సంఘాలకు బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ కౌమార దశలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా అధిగమిస్తూ జీవితంలో లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని బాలికలకు సూచించారు. ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడంతో పాటు మానసిక, భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవాలని, అవసరమైనప్పుడు షీ టీమ్స్ సహాయం పొందాలని తెలిపారు.సైకాలజిస్ట్ డాక్టర్ బారుపాటి గోపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మానసిక అడ్డంకులను అధిగమిస్తూ జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని, సోషల్ మీడియాను విచక్షణతో వినియోగిస్తూ సైబర్ మోసాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్.రాధిక మాట్లాడుతూ కౌమార దశలో కలిగే శారీరక, మానసిక మార్పులపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సంకోచించకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలిపారు.

బాలికల భద్రత, సాధికారత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని, బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సమస్యలను ధైర్యంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అడిషనల్ డీసీపీలు బాలస్వామి, ఏసీపీలు సదయ్య, వెంకటరమణ, షీ టీమ్స్ ఇన్‌స్పెక్టర్ సువర్ణ, ఇన్‌స్పెక్టర్ ఓ.రమేష్, భరోసా సెంటర్ ఎస్‌ఐ కిరణ్మయి, షీ టీమ్స్ ఆర్.ఎస్‌ఐ  స్వాతి, ఎస్‌ఐ రామారావు తదితర పోలీస్ అధికారులు, వరంగల్ జిల్లాలోని తొమ్మిది మండలాలకు చెందిన బాలికలు, మెప్మా, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు