భారత్ రికార్డుల హోరు

28-10-2026 | 05:05am

వెల్లింగ్టన్, అక్టోబర్ 27 : న్యూజిలాండ్ పర్యటనలో(New Zealand Tour) టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్(India) వెల్లింగ్టన్ వేదికగా రికార్డుల మోత మోగించింది. టీ20 ఫార్మాట్‌లో(T20 format) పలు అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసకర సెంచరీకి తోడు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) మెరుపులతో పవర్ ప్లేలో ఏకంగా 118 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. 2021లో సెర్బియాపై రొమేనియా (116 పరుగులు) చేసిన రికార్డును భారత్ అధిగమించింది.

పూర్తి సభ్యత్వ దేశాల పరంగా ఇదే అత్యుత్తమ స్కోరు. అలాగే టీ20ల్లో ఫాస్టెస్ట్ 50 రికార్డును కూడా సాధించింది. కేవలం 2.2 ఓవర్లలోనే (14 బంతుల్లో) భారత్ 50 పరుగుల మార్కును అందుకుంది. అలాగే ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150 రికార్డు కూడా ఖాతాలో వేసుకుంది. కేవలం 5 ఓవర్లలోనే టీమ్ స్కోరు 100 పరుగులు దాటింది.అలాగే కేవలం 7.4 ఓవర్లలోనే భారత్ 150 పరుగులు పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఇదిలా ఉంటే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ జోడీ మొదటి వికెట్కు కేవలం 7 ఓవర్లలోనే 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో 100 కంటే ఎక్కువ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాల్లో అత్యధిక రన్ రేట్ సాధించిన రికార్డు వీరి ఖాతాలో చేరింది. ఈ జోడీ ఓవర్‌కు 18.13 పరుగుల చొప్పున స్కోర్ చేసింది. గతంలో ఇంగ్లాండ్ జోడీ జోస్ బట్లర్ - ఫిల్ సాల్ట్ పేరిట ఉన్న 16.08 రన్ రేట్ రికార్డును వైభవ్,అభిషేక్ బ్రేక్ చేశారు. మరోవైపు అభిషేక్ శర్మ పలు వ్యక్తిగత రికార్డులను కూడా సాధించాడు.

కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి కివీస్ గడ్డపై సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున జాయింట్ సెకండ్-ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతులు) చేసిన రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఓవరాల్ టీ20 క్రికెట్లో  అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో అభిషేక్ తన 11వ టీ20 సెంచరీ పూర్తి చేసుకోగా, విరాట్ కోహ్లీ (10 సెంచరీలు) రికార్డును అధిగమించాడు.

మరిన్ని వార్తలు