కుష్టు వ్యాధిని దాచవద్దు ముందస్తుగానే గుర్తించాలి
వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి
తుంగతుర్తి,(విజయక్రాంతి): జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం(National Leprosy Eradication Programme)లో భాగంగా నిర్వహించిన కుష్ఠు వ్యాధి గుర్తింపు ప్రచార కార్యక్రమం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Center) రావులపల్లి పరిధిలో మొత్తం 44 మంది కుష్ఠు వ్యాధి అనుమానిత కేసులను, గుర్తించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి తెలిపారు. గుర్తించిన 44 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి నిర్ధారణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
డాక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కుష్ఠు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడం జరిగింది తెలిపారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, తద్వారా శారీరక వైకల్యాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కుష్ఠు వ్యాధికి ఉచితంగా పరీక్షలు మరియు చికిత్స అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కుష్ఠు వ్యాధి పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు, వివక్షకు తావివ్వకుండా, చర్మంపై స్పర్శ జ్ఞానం లేని మచ్చలు, చేతులు మరియు కాళ్లలో తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్య సిబ్బందికి సహకరిస్తూ కుష్ఠు వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని డాక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ శ్రీ సురేష్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావులపల్లి లెప్రసీ నోడల్ పర్సన్ గాజుల సోమన్న, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.