భావితరాలకు చారిత్రక వారసత్వాన్ని అందించాలి

13-11-2026 | 03:42pm
  1. కోటగుళ్ల శిల్ప సంపద అద్భుతం
  2. రచయిత మిట్టపల్లి సురేందర్

గణపురం,నవంబర్ 13 (విజయ క్రాంతి): చారిత్రక వైభవానికి, కాకతీయుల అద్భుత(Kakatiyas marvelous) శిల్పకళకు ప్రతీకగా నిలిచిన గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధ కోటగుళ్లను వర్తమాన రచయిత, కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్ శుక్రవారం  సందర్శించారు. కోటగుళ్లలో జరుగుతున్న బబ్లు డబుల్ ఎక్సల్ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణానికి వచ్చి అక్కడి శిల్ప సంపదను, నిర్మాణ శైలిని ఆసక్తిగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి కోటగుళ్లు అద్భుత నిదర్శనమని అన్నారు. ఆలయ నిర్మాణంలో కనిపించే సూక్ష్మమైన శిల్పాలు, రాతి కట్టడాల ప్రత్యేకత, ఆనాటి నిర్మాణ శైలి ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇలాంటి చారిత్రక కట్టడాలు మన పూర్వీకుల గొప్పతనాన్ని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు చాటిచెప్పే అమూల్యమైన వారసత్వ సంపదగా పేర్కొన్నారు.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన కోటగుళ్లను పరిరక్షించడంతో పాటు వాటి విశిష్టతను ప్రజలకు మరింతగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు ఈ అపురూపమైన వారసత్వ సంపదను అందించేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. సినిమా చిత్రీకరణకు ఇలాంటి చారిత్రక ప్రదేశాలను ఎంపిక చేయడం ద్వారా కోటగుళ్ల ప్రత్యేకత మరింత మందికి తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏ చికితా డైరెక్టర్  ధనరాజ్ లెక్కల, గాంధీనగర్ సర్పంచ్ డాక్టర్ ఇంజపెల్లి శ్రీనివాస్ లు ఉన్నారు.

మరిన్ని వార్తలు