సిద్దిపేట రైతులకు పరిహారంలో వివక్ష తగదు

13-11-2026 | 03:52pm

ఎకరాకు రూ.23 లక్షలు చెల్లించాలి.. మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్

సిద్దిపేట రూరల్, నవంబర్ 13 (విజయక్రాంతి): అదనపు టీఎంసీ ప్యారలల్ కాలువ నిర్మాణంలో(Construction of the TMC parallel canal) భూములు కోల్పోతున్న వెంకటాపూర్, తడ్కపల్లి గ్రామాల రైతులకు ఎకరాకు రూ.23 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులతో కలిసి జిల్లా భూసేకరణ అధికారి, ప్రత్యేక ఉప కలెక్టర్ కార్యాలయంలో అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట రూరల్, అర్బన్ మండలాల పరిధిలో సుమారు 140 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. 2019 నాటి ధరల ప్రకారం పరిహారం చెల్లిస్తామని చెప్పడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఎకరాకు రూ.18 లక్షలు, కొడంగల్‌లో రూ.21 లక్షలు చెల్లిస్తుండగా, సిద్దిపేట రైతులకు కేవలం రూ.14.50 లక్షలు మాత్రమే ఇవ్వడం ప్రాంతీయ వివక్షకు నిదర్శనమన్నారు.

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పరిహారాన్ని పునఃపరిశీలించి ఎకరాకు రూ.23 లక్షలు చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుతో కలిసి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బట్టు భాస్కర్ రెడ్డి, అర్బన్ మండల అధ్యక్షులు పూల బాలకృష్ణారెడ్డి, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఎర్ర యాదయ్య, పిఏసీస్ ఛైర్మెన్ నల్ల నరేందర్ రెడ్డి, గ్రామాల సర్పంచులు నరేందర్ రెడ్డి, రత్నకర్ గౌడ్,అంబటి దేవదాస్ గౌడ్, గణపురం కృష్ణ, కోడూరి రాజు,మ్యాకల వెంకట్ రెడ్డి,గుర్రం సతీష్ రెడ్డి బండి శ్రీకాంత్,హర్ష వర్ధన్ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు...

మరిన్ని వార్తలు