వరి సాగుకు బదులుగా ఉద్యాన పంటలు

13-11-2026 | 03:34pm
  1. ఆయిల్ పామ్, సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహం
  2. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

జగిత్యాల, నవంబర్ 13 ( విజయ క్రాంతి ): రబీ 2026-27 సీజన్‌ లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని నేపథ్యంలో వరి సాగును నివారించి, పండ్లు, కూరగాయలు, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు, సూక్ష్మ సేద్యం పై రైతులకు అవగాహన కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు.

శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వి వి జి రామ్ జి పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రబీ 2026-27 సీజన్‌లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున వరి సాగును నివారించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు. ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు, సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

పంటల వైవిధ్యీకరణ, ఖరీఫ్ పంటల ఉత్పాదకత పెంపు, రైతు ఐడీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ, ప్రత్యామ్నాయ పంటలు, వాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌ లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించినప్పటికీ కనీస మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం విక్రయించి రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.

అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనుగోళ్లకు సిద్ధంగా ఉంచాలని, రైతులందరి వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు.

విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలి....

విద్యాశాఖ పై సమీక్షిస్తూ, పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరు పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరును పర్యవేక్షించాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు కనీసం 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాఠశాలల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని నిరంతరం సమీక్షించాలని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరు మెరుగ్గా ఉంటే విద్యార్థుల హాజరు కూడా పెరుగుతుందని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరైతే వారి అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ అభ్యసన వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

విద్యా సంస్థల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి.....

రూసా 2.0, పీఎం ఉషా పథకాల కింద మొత్తం 41 పనులు మంజూరు కాగా, ఇప్పటివరకు 8 పనులు పూర్తయ్యాయని, మరో 33 పనులు పురోగతిలో ఉన్నాయని సీఎస్ తెలిపారు. మంజూరైన నిధుల్లో ఇప్పటివరకు 41 శాతం మాత్రమే ఖర్చు చేసినందున, మిగిలిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 వేల కోట్ల వ్యయంతో 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ.625 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ పనులను కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వేగవంతం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రూ.1,108 కోట్లతో మంజూరైన 115 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత....

ప్రభుత్వ అభివృద్ధి పనులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. భూసేకరణ కోసం అవసరమైన నిధులను కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైతే భూసేకరణ కు అదనపు నిధులు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.

వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలి....

గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కల సమస్యను సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలని సీఎస్ సూచించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించి, నిబంధనల ప్రకారం వాటిని పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వి బి జి రాం జి ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టాలి....

పథకం కింద చేపట్టే పనులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సూచించారు. గ్రామాల్లో నీటి సంరక్షణకు ఉపయోగపడే నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని, అన్ని కాలువలను శుభ్రం చేసి అవసరమైన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ యెల్లంపల్లి కాలువల నెట్‌వర్క్ స్టేజ్-2లో ప్యాకేజీ 1, 2, 3లకు, కలి కోట సూరమ్మ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశామని, ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్‌కు వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భూసేకరణ కు సంబంధించి పెండింగ్‌ లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని, అవసరమైన సమన్వయంతో పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ప్రసునాంబ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు