కాల్చితే కాలుష్యం.. కలియదున్నితే భూసారం!

25-11-2026 | 05:20am
  1. పంట అవశేషాలు కాల్చితే నేలలోని మిత్రజీవులకు నష్టం
  2. దిగుబడులపై తీవ్ర ప్రభావం
  3. కలియ దున్నితే భూసార వృద్ధి
  4. ఆధునిక పద్ధతులను అవలంబించాలంటున్న వ్యవసాయ నిపుణులు

గరిడేపల్లి, నవంబర్ 24 : పంట(Crop) చేతికొచ్చిందన్న సంతోషంలో ఉన్న రైతులు(Farmers) కోతల అనంతరం పొలాల్లో మిగిలిన వరికొయ్యలను కాల్చివేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పొలాన్ని త్వరగా శుభ్రం చేసుకోవడంతో పాటు తదుపరి పంట సాగుకు(Crop Cultivation) భూమిని సిద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు రైతులు పంట అవశేషాలకు నిప్పు పెడుతున్నారు. అయితే ఈ విధానం వల్ల భూసారం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం(Environmental Pollution) పెరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు(Agricultural Experts) హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనం కోసం అనుసరిస్తున్న ఈ పద్ధతి భవిష్యత్తులో నేల ఆరోగ్యంపై(Soil Health) తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

భూసారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం

పంట అవశేషాలను పొలాల్లోనే కాల్చడం వల్ల నేలలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, వానపాములు అధిక ఉష్ణోగ్రతలకు గురై నశించే ప్రమాదం ఉంది. దీనివల్ల నేలలో సేంద్రియ పదార్థం(Organic matter) తగ్గి భూమి సహజ సారవంతమైన లక్షణాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా నత్రజని, సల్ఫర్ వంటి పోషకాలు వేడి కారణంగా వాయు రూపంలో నష్టపోతాయి. ఫలితంగా నేల ఆరోగ్యం దెబ్బతిని భవిష్యత్తులో పంటల ఎదుగుదల, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రజారోగ్యానికి ముప్పే.. 

పొలాల్లో కొయ్యకాళ్లను తగలబెట్టడం వల్ల వెలువడే పొగ గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, ఇతర కాలుష్య కారకాలను పెంచుతుంది. సమీప గ్రామాల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంట, గొంతు ఇబ్బందులతో బాధపడే ప్రమాదం ఉంది. పొగ కారణంగా రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

 కలియ దున్నితేనే భూసార వృద్ధి 

పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం ద్వారా సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చు. మల్చింగ్ పద్ధతిలో నేలపై పరచడం, కంపోస్టుగా తయారు చేయడం, పశువుల మేతగా వినియోగించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్రాల సహాయంతో కొయ్యకాళ్లను సేకరించి ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు.

ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కావున తాత్కాలిక ప్రయోజనం కోసం పంట అవశేషాలను కాల్చే పద్ధతిని విడనాడి, వాటిని భూమిలోనే కలియ దున్ని సంపదగా మార్చుకునే దిశగా రైతులు అడుగులు వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

 రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

వరి కొయ్యకాళ్లను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, వాటిని భూమిలోనే దున్నడం ద్వారా కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సంప్రదాయంగా అనుసరిస్తున్న కొయ్యకాల దహన పద్ధతికి స్వస్తి పలికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను ఉపయోగిస్తూ, శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియా దున్ని సేంద్రియ పదార్థంగా మార్చుకోవడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చు.                     

- ప్రియతమ్ కుమార్, మండల 

వ్యవసాయ అధికారి, గరిడేపల్లి

మరిన్ని వార్తలు