రోడ్డు గుంతలమయం.. ప్రయాణం అనుక్షణం భయం..!
- అద్వాన్నంగా జాన్ పహాడ్ దర్గా- దామరచర్ల రహదారి
- పట్టించుకోని ఆర్‌అండ్ బి అధికారులు
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
- గుంటలు కూర్చి ప్రయాణం సాఫీగా జరిగేలా చూడాలని ప్రయాణికుల వేడుకోలు
పాలకవీడు, నవంబర్ 18: రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు గుంతల మయంగా అధ్వానంగా మారినాయి. దీంతో ఆ రోడ్లపై ప్రయాణానికి వా హనదారులు అనుక్షణం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త రోడ్లు వేయడం పక్కనపెట్టి కనీసం పాత రోడ్లు గుంతల మయంగా మారిన మరమ్మత్తు చేయించడం విషయంలో పట్టించుకునే నాధులే కరువయ్యారని వాహనదారులు ప్రయాణికులు పేర్కొంటున్నారు.
అధ్వాన్నంగా జాన్ పహాడ్ దర్గా --దామరచర్ల రహదారి :
మండలంలోని జానపహాడ్ దర్గా(Janpahad Dargah) నుండి నల్లగొండ జిల్లాలో దామరచర్ల(Damarcharla) వైపు వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్ అంతా గుంతల మయంగా మారి సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారని వాహనదారులు ప్రయాణికులు వాపోతున్నారు. శూన్యపహాడ్ సమీ పంలో ప్రధాన రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు వాహనాలు నడపడానికి రోజు ఇబ్బందులు
పడుతున్నారు ఆటోలో బైక్ లపై ప్రయాణించే ప్రయాణికులుసైతం గుంతలమైన రోడ్డు మీద ఎత్తి వేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. వాహనదారుల నుండి రోడ్డు పన్ను ప్రభుత్వం వసూలు చేస్తున్నప్పటికీ రోడ్ల మరమ్మత్తు విషయంలో పట్టించుకోవటం లేదని వాహనదారులు ప్రయాణికులు విమర్శిస్తున్నారు.
పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు!:
గతంలో ప్రధాన రోడ్లు గుంతలు ఏర్పడితే ఆర్ అండ్ బి శాఖ అధికారులు ప్యాచ్ వర్క్ పనులు ఎప్పటికప్పుడు చేపట్టేవారు. కానీ గత రెండు, మూడు సంవత్స రాల నుండి ఆ శాఖ అధికారులు తమ పరిధిలోని ప్రధాన రోడ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రధాన ఆర్ అండ్ బి రోడ్లు గుంతలమయంగా మారిన ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికంగా వారి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధాన రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డ ఆ శాఖ అధికారులు కాని ఇతర సంబంధిత శాఖ అధికారులు కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతిరోజు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మత్తులు చేయించి వాహనదారుల, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
రోడ్డును బాగుచేయించాలి
జానపహాడ్ దర్గా నుంచి శూన్యపహాడ్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పూ ర్తిగా గుంతలమయంగా మారింది. ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈరోడ్డు బాగు చేయించాలని పలుమార్లు అధికారులు, పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవటంలేదు. అధికారులు, వెంటనే స్పందించి రోడ్డును వెంటనే బాగు చేయించి ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా చూడాలి.
నరి నాయక్, బీజేపీ మండల అధ్యక్షులు, పాలకవీడు మండలం