కోదాడ సంత.. తీరని చింత!

20-10-2026 | 05:20am
  1. రైతులకు కనీస వసతులు కరువు
  2. పశువులకు తాగునీరు ఉండదు
  3. మూత్రశాలలు, మరుగుదొడ్లు కనుమరుగు
  4. రసీదులు ఇవ్వకుండానే వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపణలు
  5. సమస్యలు పరిష్కరించాలని పలువురి వేడుకోలు

కోదాడ, అక్టోబర్ 19 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల(Andhra Pradesh and Telangana states) సరిహద్దు ప్రాంతంలో కీలక పట్టణమైన కోదాడలో నిర్వహించే పశువుల సంత(Cattle Market) చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అతిపెద్ద సంతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి వారం ఈ సంతకు పెద్ద సంఖ్యలో రైతులు, పశువుల వ్యాపారులు(Farmers and cattle traders) తరలివస్తుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన సంతలో రైతులకు కనీస సౌకర్యాలు లేకపోవడం, నిర్వహణ తీరుపై ఆరోపణలు వెల్లువెత్తడం ఆందోళన కలిగిస్తోంది.

రసీదులు లేకుండా వసూళ్ల ఆరోపణలు

సంతలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలు, అమ్మకాల సమయం లో రసీదులు ఇవ్వకుండా డబ్బులు వసూ లు చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. రసీదులు ఇవ్వకుండా వసూలు చే స్తున్న సొమ్ము ఎవరికి చేరుతోంది. సంతలో జరిగే లావాదేవీలకు అధికారిక లెక్కలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని రైతులు, వ్యాపా రులు కోరుతున్నారు.

పశువులకు నీళ్లు.. రైతులకు వసతులు కరువు

పశువుల కొనుగోలు, అమ్మకాల కోసం దూర ప్రాంతాల నుంచి సంతకు వచ్చే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎండలో గంటల తరబడి ఉండే పశువులకు సరిపడా తాగునీటి సదుపాయం లేకపోవడం ఆందోళనకరం. పశువు లకు నీటి వసతి కల్పించాల్సిన బాధ్యతను నిర్వాహకులు ఎందుకు విస్మరిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కనిపించని మరుగుదొడ్లు 

వందలాది మంది రైతులు, వ్యాపారులు రాకపోకలు సాగించే సంతలో కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేకపోవడం దుస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటోంది. పారిశుధ్య నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఆదాయానికి తగ్గ వసతులేవి..?

సంత ద్వారా ఆదాయం సమకూరుతున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతు లు ఎందుకు కల్పించడం లేదనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. సంత నిర్వహణకు సంబంధించిన ఆదాయం, వసూళ్లు, ఖర్చుల వివరాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు దృష్టి సారించాలి

కోదాడ పశువుల సంతలో రసీదుల జారీ, వసూళ్ల విధానం, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యంపై సంబంధిత అధికారులు తక్షణమే దృష్టి సారించాలి. సంత నిర్వహణలో పారదర్శకత పాటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కోదాడ సంత నిర్వహణపై అధికారులు ఇప్పటికైనా స్పందించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని రైతులు, పశువుల వ్యాపారులు కోరుతున్నారు. 

మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

రసీదులు ఇవ్వకుండా బండ్లను బయటకు వెళ్లనివ్వడం వంటి ఘటనలు మా దృష్టికి రాలేదు. అలాంటి పరిస్థితులు లేవు.. ఎవరైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే శుక్రవారం నీటి తొట్టెలను నింపి శనివారం, ఆదివారం కూడా నీరు నిండుగా ఉంచి పశువులకు నీటి కొరత లేకుండా చూస్తాం. 

 ఖాజా మొయినుద్దీన్, 

వ్యవసాయ కార్యదర్శి, కోదాడ

మరిన్ని వార్తలు