చిన్నారుల చదువుకు బ్రేక్

29-09-2026 | 11:30am

ప్రీ ప్రైమరీ టీచర్ రాక... చిన్నపిల్లల కష్టాలు

సెప్టెంబర్ 5 నుంచి సెలవులో ఉన్నట్టు, తెలుపుతున్న హెడ్మాస్టర్

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ప్రీ-ప్రైమరీ తరగతులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ప్రీ-ప్రైమరీ టీచర్ల(Pre-primary teachers)ను ఏర్పాటు చేసి చిన్నారులకు ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన అందిస్తున్నారు. అయితే ఓ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ టీచర్ కొంతకాలంగా విధులకు హాజరు కాకపోవడంతో చిన్నారుల చదువుపై ప్రభావం పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మండల కేంద్రానికి చెందిన చెన్నబోయిన శ్రీలేఖ ఇంటర్మీడియట్ విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రీ-ప్రైమరీ టీచర్‌గా ఎంపికైనట్లు సమాచారం. అయితే సెప్టెంబర్ 5 నుంచి అనారోగ్య కారణాలతో ఆమె పాఠశాలకు హాజరు కావడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

టీచర్ గైర్హాజరు(Teacher absence)తో చిన్నారులకు ఆటపాటలు, ప్రాథమిక విద్యాబోధన అందించే బాధ్యత ప్రస్తుతం ఆయాపైనే పడిందని వారు పేర్కొంటున్నారు. దీంతో తమ పిల్లలకు సక్రమంగా చదువు సాగడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లడం, కొంతసేపటికే తిరిగి రావడం తప్ప విద్యాబోధన సరిగా జరగడం లేదని వారు చెబుతున్నారు.

ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం డీఈఓ పరిధిలో ఉందని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. చిన్నారుల విద్యాభ్యాసం దెబ్బతినకుండా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయంగా మరో ప్రీ-ప్రైమరీ టీచర్‌ను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు