గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
‘గిరిజన గళం–తండాలో నిద్ర’ కరపత్రాలు ఆవిష్కరణ
చివ్వెంల, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సేవాలాల్ సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ‘గిరిజన గళం–తండాలో నిద్ర’ కార్యక్రమ కరపత్రాలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, కౌన్సిలర్ జ్యోతి లింగా నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర క్యాబినెట్‌లో లంబాడీలకు మంత్రి పదవి కల్పించకపోవడం వారిని అవమానించడమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డీమ్డ్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని, మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలని కోరారు.
గోర్ బోలి భాషను ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని, రాష్ట్ర నడిబొడ్డున సేవాలాల్ మహారాజ్ మందిరం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సాధు సంతులకు ధూపదీప నైవేద్యంతో పాటు గౌరవ వేతనం అందించాలని కోరారు. గిరిజనుల హక్కుల సాధన కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.