ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి

11-09-2026 | 04:45pm

జ్వరంతో వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి

శిథిలావస్థలో ఉన్న ఎస్సీ హాస్టల్‌కు కొత్త భవన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అందుబాటులో ఉన్న ఎక్స్‌రే, ల్యాబ్‌ తదితర సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి(Collector Adarsh ​​Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖిల్లాఘనపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(government social health center) ఆయన పరిశీలించారు. ల్యాబ్‌, ఎక్స్‌రే గదులను తనిఖీ చేసి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

జ్వరంతో వచ్చే వారికి ప్రత్యేక పరీక్షలు 

జ్వర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ పరీక్షలు(Dengue tests) నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. క్షయ వ్యాధి అనుమానం ఉన్న రోగులను గుర్తించి అవసరమైన ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డుల్లో పరిశుభ్రతను కాపాడాలని ఆదేశించారు.

ఎస్సీ హాస్టల్‌కు నూతన భవనం 

అనంతరం ఖిల్లాఘనపూర్‌లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన హాస్టల్‌ భవనానికి సంబంధించి పూర్తి వివరాలతో ఫైల్‌ సిద్ధం చేసి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఎస్సీ సంక్షేమ అధికారిని ఆదేశించారు. నూతన భవనం నిర్మించే వరకు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ భవనాన్ని గుర్తించి తాత్కాలిక వసతి కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, ఎస్సీ సంక్షేమ అధికారి రాంజీరావు, తహసీల్దార్‌, ఎంపీడీవో, వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు