వినాయకుడి చాటున చందాల జోరు!

14-09-2026 | 05:00am

గల్లీగల్లీలో కొలువైన గణనాథులు 

మండపాల సందడితో మొదలైన ‘చందాల పండుగ’  

నాయకుల జేబులకు చిల్లులు.. 

ఎవరు ఎంత ఇచ్చారో లెక్కలు!  

వనపర్తి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): వినాయక చవితి(Vinayaka Chavithi) వచ్చేసింది.. గల్లీ గల్లీలో గణనాథుడు కొలువుదీరాడు. చిన్న వీధి మొదలుకొని ప్రధాన కూడళ్ల వరకు ఎక్కడ చూసినా వినాయక మండపాలే దర్శనమిస్తున్నాయి. యువత ఉత్సాహంగా ఉత్సవ కమి టీలను ఏర్పాటు చేసుకుని పండుగ ఏర్పాట్ల లో నిమగ్నమైంది. మండపాల వద్ద విద్యుత్ దీపాలంకరణలు, ప్రత్యేక అలంకరణలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. 

ఒకవైపు పండుగ సందడి.... మరో వైపు చందాల సందడి ..

పండుగ సందడి ఒకవైపు ఉంటే.. మరోవైపు చందాల సందడి మొదలైంది. మండ పాల నిర్వాహకులు విరాళాల కోసం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ప్రముఖులను సంప్రదిస్తున్నారు. దీం తో నాయకుల జేబులకు చిల్లులు పడుతున్నాయన్న చర్చ మొదలైంది. ఒక మండపం, రెండు మండపాలతో మొదలైన విరాళాల వ్యవహారం.. మండపాల సంఖ్య పెరిగే కొద్దీ నాయకులపై ఆర్థిక భారం పెరుగుతోంది. 

మండపం కనిపిస్తే.. చందా తప్పదా? 

వినాయక మండపం ఏర్పాటు చేసిన నిర్వాహకులు ముందుగా తమ ప్రాంతంలోని ముఖ్యులను సంప్రదించడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘మా మండపానికి ఇంత ఇచ్చారు.. మీరు ఎంత ఇస్తారు?’ అన్న రీతిలో కొన్నిచోట్ల ఒత్తిళ్లు కూడా ఉంటున్నాయన్న చర్చ వినిపిస్తోంది. 

విరాళాల్లోనూ ‘పోటీ’! 

రాజకీయ నాయకులకు కూడా ఇది కాస్త ఇబ్బందికరంగానే మారుతోంది. ఒక మండపానికి పెద్ద మొత్తంలో విరాళం ఇస్తే.. పక్క మండపం నిర్వాహకులు కూడా అదే స్థాయిలో ఆశిస్తున్నారు. దీంతో ఎవరికెంత ఇవ్వాలి? ఎక్కడ ఎంత ఇవ్వాలి? అన్న లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో తమకు మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు విరాళాల విషయంలో వెనక్కి తగ్గడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

భక్తి మాటున.. రాజకీయ సందడి! 

వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలకు ప్రతీకగా నిలవాల్సి ఉండగా.. కొన్నిచోట్ల రాజకీయ సందడికి కూడా వేదికగా మారుతున్నాయి. నాయకులు మండపాలను సందర్శించడం, పూజల్లో పాల్గొనడం, ఉత్సవ కమిటీలకు విరాళాలు అందించడం సాధారణంగా మారింది. దీంతో వినాయకుడి ఉత్సవాల్లో భక్తి ఎంత? రాజకీయ లెక్కలు ఎంత? అన్న చర్చ ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. 

ఆర్భాటానికి అడ్డుకట్ట పడేనా? 

భారీ విగ్రహాలు, విద్యుత్ దీపాలంకరణలు, డీజేలు, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ఖర్చులు పెరుగుతున్నాయి. పండుగను భక్తితో నిర్వహించడంలో తప్పులేదు కానీ.. ఆర్భాటం, అనవసర ఖర్చులు, ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. గణనాథుడి రాకతో గల్లీ గల్లీ పండుగ కళ సంతరించుకుంది. అదే సమయంలో మండపాల చందాలతో రాజకీయ నాయకుల జేబులకూ చిల్లులు పడుతున్నాయి. మరి ఈసారి ఏ నాయకుడు ఎన్ని మండపాలకు ఎంత చందా ఇచ్చారు? ఎవరి విరాళం పెద్దది? అన్నది స్థానికంగా హాట్టాపిక్గా మారింది

మరిన్ని వార్తలు