చిరునవ్వుతో జగతి సృష్టి.. కూష్మాండ దేవి శక్తి!
14-10-2026 | 08:59am
శరన్నవరాత్రుల (Sharannavaratri) నాలుగో రోజున దుర్గాదేవిని కూష్మాండ దేవి రూపంలో భక్తులు పూజిస్తారు. తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి స్వరూపంగా అమ్మవారిని ఆరాధిస్తారు. కూష్మాండ దేవి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. కూష్మాండ దేవి ఎనిమిది చేతులతో సింహవాహనంపై దర్శనమిస్తారు. అందుకే ఆమెను అష్టభుజ దేవి (Ashtabhuja Devi) అని కూడా పిలుస్తారు. అమ్మవారి చేతుల్లో కమండలం, ధనుస్సు, బాణం, తామరపువ్వు, అమృత కలశం, చక్రం, గదతో పాటు సిద్ధులు, నిధులను ప్రసాదించే జపమాల ఉంటాయి. ఈ వస్తువులు శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకలుగా భావిస్తారు.
కూష్మాండ దేవి పూజలో గుమ్మడికాయకు విశేష ప్రాధాన్యం ఉంది. అమ్మవారికి గుమ్మడికాయతో తయారు చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అమ్మవారి మంత్రాలను జపిస్తే ఆమె అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి ఆరాధనతో శుభాలు కలుగుతాయని నమ్మకం నవరాత్రుల్లో కూష్మాండ దేవిని పూజించడం వల్ల మనసుకు ప్రశాంతత, జీవితంలో సానుకూలత కలుగుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారి కరుణాకటాక్షాలతో కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. కూష్మాండ దేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని కోరుకుందాం. జై మాతా దీ