చిరగదు.. నానదు!

14-10-2026 | 05:05am
  1. మీసేవ సర్టిఫికెట్లకు సరికొత్త రక్షణ కవచం
  2.    15 అత్యాధునిక ఫీచర్లతో ప్రత్యేక పేపర్
  3. ఏళ్ల తరబడి భద్రపరుచునేలా రూపకల్పన  
  4. ఇక లామినేషన్ అవసరం లేదు
  5. కొత్త పేపర్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 13: మీసేవ(Mee Seva) కేంద్రాల్లో తీసుకునే సర్టిఫికెట్లను(Certificates) ఇక లామినేషన్ చేయించి భద్రపరుకోవాల్సిన అవసరం ఉండదు. మలిచినా, నీళ్లలో పడినా పాడవకుండా ఏళ్ల తరబడి భద్రంగా దాచుకునేలా ప్రత్యేక పేపర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ధ్రువ పత్రాల(Government certificates) మన్నిక, భద్రతను పెంచే లక్ష్యంతో రూపొందించిన కొత్త మీసేవ సర్టిఫికెట్ పేపర్‌ను  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రారంభించారు.

15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించిన ఈ పేపర్ ద్వారా జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు చిరిగిపోవడం, తడవడం వంటి సమస్యల నుంచి రక్షణ పొందనున్నాయి. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, విజయ రమణారావు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి. రవికిరణ్,  అధికారులు, ప్రింటింగ్ ఏజెన్సీలు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

నకిలీలకు అడ్డుకట్ట

ప్రస్తుతం సాధారణ పేపర్లపై ఇచ్చే సర్టిఫికెట్లను కలర్ జిరాక్స్ తీసి లేదా ఎడిట్ చేసి నకిలీవి సృష్టిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నారు. కొత్త పేపర్‌లో వాడే 15 రకాల భద్రతా ఫీచర్ల వల్ల అనధికారికంగా డూప్లికేట్ కాపీలు తయారు చేయడం సాధ్యం కాదు. ఒరిజినల్ సర్టిపికెట్‌ను, నకిలీ దాన్ని సులభంగా వేరుచేసి గుర్తించేలా ఇందులో ప్రత్యేక సాంకేతికత ఉంటుంది. మీసేవ కేంద్రాల్లో ప్రస్తుతం సర్టిఫికెట్ల జారీకి వినియోగిస్తున్న పేపర్ త్వరగా చినిగిపోవడం లేదా మడతలు పడి పాడవుతుంటాయి. కొత్త పేపర్‌ను ప్రత్యేక టెక్నాజీతో తయారు చేయడం వల్ల అంత సులభవంగా పాడవదని నిపుణులు అంటున్నారు. పేపర్ నాణ్యత వల్ల దశాబ్దాల పాటు భద్రపరుచుకోవచ్చు.

2011 నుంచి ‘మీసేవ’ల్లో ప్రత్యేక పేపర్ 

తెలంగాణలో మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 2011 నుంచి మీ సేవ సర్టిఫికెట్ల ముద్రణకు ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పేపర్ స్థానంలో మరింత నాణ్యత, భద్రత, మన్నిక కలిగిన కొత్త పేపర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు దీర్ఘకాలం భద్రపరచాల్సిన ఇతర ప్రభుత్వ పత్రాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. 

ధ్రువపత్రాలకు మరింత భద్రత: మంత్రి శ్రీధర్‌బాబు

జనన, మరణ, విద్య, ఉద్యోగ తదితర సర్టిఫికెట్లు ఎంతో ముఖ్యమైనవని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కొన్ని పత్రాలను జీవితాంతం భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాంటి ధ్రువపత్రాలు త్వరగా పాడవకుండా చూడటంతో పాటు వాటి విశ్వసనీయతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని మరింత పెంచే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని వివరించారు. కొత్త పేపర్‌తో సర్టిఫికెట్ల మన్నిక పెరగడంతో పాటు నకిలీలను అరికట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రభుత్వ ధ్రువపత్రాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు