ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పోచారంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి.శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేయనున్నారు. స్థానిక ఎల్ఐజీ కాలనీకి ఆనుకుని ఉన్న స్థలంలో రూ.43.20 కోట్ల వ్యయంతో 480 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన లబ్ధిదారులకు డిజిటల్ (Digital) పద్ధతిలో లాటరీ నిర్వహించి, ఫ్లాట్ల నంబర్లు కేటాయించడంతోపాటు సంబంధిత పత్రాలు అందజేయనున్నారు. మొదటి విడత వాయిదాగా రూ.లక్ష చెల్లించిన వారికి బ్యాంకు రుణం కోసం నిరభ్యంతర పత్రం (NOC) అందించనున్నారు.
లబ్ధిదారులందరూ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాలని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ కోరారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లు, ప్రభుత్వ గుర్తింపు పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. కార్యక్రమం జరిగే ప్రాంగణంలోనే పీఎంఏవై (PMAY) పథకానికి దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. బ్యాంకు రుణాలు పొందాలనుకునే వారి కోసం పలు బ్యాంకుల స్టాళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులు కార్యక్రమానికి గంట ముందుగానే చేరుకోవాలని హౌసింగ్ బోర్డు అధికారులు సూచించారు.