‘ది జర్నీ ఆఫ్ ఎ గ్రెయిన్’ కళా ప్రచారం
వజ్రతేజ ‘బీజమ్’ఆధ్వర్యంలో విద్యార్థులకు అవకాశం
ఈ నెల 31 వరకు ఎంట్రీలకు గడువు
హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి): తెలంగాణలో అతిపెద్ద వరి మిల్లింగ్(Paddy milling), పంపిణీ సంస్థగా గుర్తింపు పొందిన వజ్రతేజ రైస్ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్(Vajrateja Rice Clusters Private Limited) విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త కళా ప్రచారం ‘ది జర్నీ ఆఫ్ ఎ గ్రెయిన్(The Journey of a Grain)’ చివరి పక్షం కార్యక్రమాన్ని ప్రకటించింది. మాదాపూర్లోని హోటల్ అవాసాలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న తమ వినియోగదారుల బియ్యం బ్రాండ్ ‘బీజమ్’ ప్రారంభానికి ముందు చేపట్టిన ఈ కార్యక్రమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు చేరువైంది.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ ప్రచారంలో పాల్గొనవచ్చు. రైతులు, తాతయ్యలు, నానమ్మలు, ఇతర వ్యవసాయ అనుభవం ఉన్న పెద్దలతో మాట్లాడి, వరి సాగులోని ఏడు దశలను కళారూపంలో ఆవిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ నెల31తో ముగియనున్న ఈ కార్యక్రమానికి సుమారు 10,000 కళాకృతులు అందుతాయని సంస్థ అంచనా వేస్తోంది. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి రుసుము లేదు. నిబంధనలకు అనుగుణంగా ఎంట్రీ సమర్పించిన ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ పోటీలో మొదటి బహుమతిగా 20వేలు, రెండో బహుమతిగా 10 వేలు, మూడో బహుమతి 8వేలు అందజేస్తారు. ఎంపికైన ఉత్తమ 100 కళాకృతులను నవంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్న బీజమ్ బ్రాండ్ ప్రారంభంలో అదే కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు.
ఈ కళా ప్రచారంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు registration.beejam.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనంతరం కేటాయించిన కోడ్ను విద్యార్థి, పాఠశాల వివరాలతో పాటు కళాకృతి వెనుక భాగంలో రాయాలి. ఎంట్రీలను పాఠశాలల ద్వారా లేదా నేరుగా కొరియర్ ద్వారా బీజమ్, 5వ అంతస్తు, అభిస్ గంగా, విట్టల్ రావు నగర్, మాదాపూర్, హైదరాబాద్ 500081 చిరునామాకు ఈ నెల 31లోగా పంపాలి. విలేకర్ల సమావేశంలో వజ్రతేజ రైస్ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ హనుమాన్ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ చిట్టిపోలు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.