కాలం ఖరీదు.. కన్నీళ్ల ఖరీఫ్
- వానకాలం పంటలపై ఎల్ నినో దెబ్బ
- యాసంగి సాగుబడికీ పొంచిన ముప్పు
- ఖరీఫ్‌లోనే రూ.20 వేల కోట్ల మేర నష్టం?
- మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనాలు
- ఎండుతున్న పంటలకు ట్యాంకర్ల సేద్యం
- ఆందోళన కలిగిస్తున్న వాతావరణ మార్పులు
- వరికి బదులు పంటలనే వేయాలంటున్న సర్కార్
- రైతులను ఆదుకోవాలని కోరుతున్న రైతు సంఘాలు
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి) : ఎల్ నినో ప్రభావంతో(Impact of El Niño) కాలం కకావికలంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం నీరుగారిపోతోంది. వాతావరణ మార్పులతో రాష్ట్ర రైతాంగం ఉక్కిరిబిక్కిరి అవుతుతోంది. సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో ఈ ఖరీఫ్ సీజన్లో(Kharif season) కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. గతంలో కంటే ఈ వానాకాలంలో పంటలు తక్కువగానే వేసినా చేతికొచ్చే సమయంలో సరిపోను నీళ్లు అందక లక్షల ఎకరాల్లో పంటలు మాడిపోతున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు పోసినా ఫలితం దక్కడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ. 20వేల కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రాథమిక అంచనా వేసినట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంతో పోలిస్తే సాగు విస్తీర్ణం 25 శాతం పడిపోయింది. నీళ్లు లేక పొలాలు ఎండిపోవడం ఒక ఎత్తయితే అసలు విత్తనాలే వేయకుండా వదిలేసిన పరిస్థితి మరో వైపు నెలకొంది. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో వరి, పత్తి రైతులు అప్పులు ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో రాబోయే యాసంగి పంట పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు అంతుపట్టని పరిస్థితి నెలకొన్నది.
అయితే ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా దెబ్బతిన్నది మాత్రం పత్తి రైతులేనని చెబుతున్నారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే ఈశాన్య రుతుపవనాలపైన రబీసాగుపైన రైతులు ఆధారపడి ఉన్నారు. ఒకవేళ అప్పుడు వానలు కురవకపోతే సాగు దండగేనని, నీటి వసతి లేని చోట తొందరపడి పెట్టుబడులు పెట్టవదని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకే యాసంగిలో వరి పంటకు వేసి రైతులు నష్టపోవద్దని చెబుతున్నారు. ఇప్పుడు విద్యుత్‌ను కూడా పొదుపుగా వాడుకోవడంతో పాటు అందుబాటులో నీటిని తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
ప్రతి పదేళ్లకోసారి ఈ పరిస్థితి..
సాధారణంగా ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాలకోసారి ఇలాంటి పరిస్థితులు రావడం సహజమేనని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా వర్షాభావ పరిస్థితితో 30 శాతం వరకు పంటల మార్పిడి కూడా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఈ ఎల్ నినో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలను సంసిద్దం చేస్తోంది. అందుకు కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రభుత్వం సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎల్‌నినో ప్రభావంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
యాసంగి సాగు సగానికే?
రాబోయే యాసంగి సీజన్‌కు కూడా సాగు నీటి కొరత ప్రమాదం పొంచి ఉన్నది. సాధారణంగా 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ, ఈ సారి వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు విస్ణీరం సగానికంటే ఎక్కువగా పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రధానంగా వరి సాగు విస్తీర్ణం 40 శాతానికి మించకపోవచ్చని, దిగుబడి పడిపోతుందని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.