సంస్కరణలు సరే.. ఓటుకు భరోసా ఏదీ?

14-10-2026 | 05:45am
  1. బూత్ ఆక్రమణలకు ఈవీఎంలతో అడ్డుకట్ట
  2. బ్యాలెట్ అక్రమాలకూ తగ్గిన అవకాశం
  3. ఓటరు జాబితాల సంగతేంటి?
  4. ‘సర్’తో భారీగా ఓట్ల గల్లంతు.. అనేక సందేహాలు
  5. ఎన్నికల సంఘం విశ్వసనీయతకు పరీక్ష
  6. ప్రక్షాళనతో పాటు పారదర్శకతా కీలకమే 

హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి):  ఒకప్పడు ఎన్నికలంటేనే బూత్ ఆక్రమణలు(Booth Capturing), బ్యాలెట్ బాక్సుల అపహరణ(Theft of ballot boxes), ఓటర్లను బెదిరించడం, పోలింగ్ కేంద్రాల స్వాధీనం, అనుకూలంగా ఓట్లు వేసుకోవడం వంటి ఘటనలు  ఉండేవి. ఈ తరహా అక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) రాయలసీమతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఎన్నికల వ్యవస్థలకే సవాల్‌గా నిలిచేవి. అక్రమాలకు అడ్డుకట్ట వేసి, పోలింగ్ ప్రక్రియను(Polling process) సమర్థవంతంగా నిర్వహించడంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(Electronic voting machines) (ఈవీఎం) ప్రవేశం కీలక మలుపుగా నిలిచింది.

ఎన్నికల సంస్కరణలో భాగంగా 1990 చివరిలో తీసుకువచ్చిన ఈవీఎంల వ్యవస్థ నుంచి దశలవారీగా 2000 సంవత్సరం ప్రారంభానికి దేశవ్యాప్తంగా విస్తరించింది. బ్యాలెట్ పత్రాల స్వాధీనం, దొంగ ఓట్లు వేయడం వంటి అక్రమాలు ఈవీఎంలతో రాకతో గణనీయంగా తగ్గాయి. ఆ తరువాత ఓటరు ఓటే వేసినట్టుగా ధ్రువీకరించే పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పోలింగ్ ప్రక్రియలో మరో పారదర్శకతకు అడుగుపడింది. బ్యాలెట్ పేపర్ల స్వాధీనం, బూత్ ఆక్రమణలను నియంత్రించి, పోలింగ్ ప్రక్రియ సమగ్రతను కాపాడటంతో ఈవీఎంలు కీలక పాత్ర పోషించాయి.

ఏరివేత సరే.. అర్హుల ఓట్లకు ఎసరు?

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కొత్తగా చేపట్టిందేమీ కాదు. మరణించిన, నకిలీ, డబుల్ ఓట్లు, వలస వెళ్లిన, ఓటరు జాబితాలో పేర్కొన్న చిరునామాలో నివసించని వ్యక్తుల ఓట్లు తొలగించేందుకు దేశంలో పలుమార్లు   ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించారు. తొలుత 2025 జూన్‌లో బిహార్‌లో ‘సర్’ చేపట్టగా, క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. అనర్హులను తొలగింపు, విదేశీ, బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించి, అర్హుల ఓటర్లను చేర్చడం ‘సర్’ ముఖ్య ఉద్దేశం.

అధికారిక గణాంకాల ప్రకారం బిహార్‌లో 2025 జూన్‌లో 7.89 కోట్లు ఉన్న ఓటర్ల సంఖ్య, ‘సర్’తో సెప్టెంబర్ 30 నాటికి 7.42 కోట్లకు తగ్గింది. సుమారు 47 లక్షల ఓట్లు తగ్గాయి. మొత్తం ఓటర్లలో దాదాపు 6 శాతం క్షీణత నమోదైంది. ముసాయిదా జాబితా దశలోనే సుమారు 65 లక్షల పేర్లు తొలగించగా, అభ్యంతరాలు, విజ్ఞప్తుల పరిశీలనతో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమబంగాల్‌లో సంఖ్యాపరంగా చూస్తే తొలగింపులు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ‘సర్’కు ముందు 7.66 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య..తుది జాబితా నాటికి 8 నుంచి 11 శాతం మధ్య తగ్గింది.

ఇవే కాకుండా ప్రత్యేక సమగ్ర సవరణ జరిగిన మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కోట్లలో ఓట్లు తొలగించబడ్డాయి. అయితే ‘సర్’ను పలువురు సమర్థిస్తున్నారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేయకుండా నిరోధించడంతో పాటు, భారత పౌరులు కానివారి పేర్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయొచ్చని వాదిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అమలులో శాస్త్రీయత, న్యాయబద్ధత పాటించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బిహార్, పశ్చిమబంగాల్‌లో అర్హుల ఓట్లు కూడా పెద్ద ఎత్తున తొలగించారని, ఇది ఎన్నికల్లో గెలుపోటములపై ప్రభావం చూపిందన్న వాదనలు వినిపించాయి. 2000 సంవత్సరం ప్రారంభంలోని పాత ఓటరు జాబితాలతో తమ సంబంధాన్ని నిరూపించే పత్రాలు అందుబాటులో లేకపోవడం, నిరంతర నివాసాన్ని ధ్రువీకరించడంలో ఎదురైన ఇబ్బందులు పలువురికి సమస్యగా మారాయి. అప్పీళ్లను విచారించిన సందర్భాల్లో, తొలగించిన పేర్లలో అధిక శాతం తిరిగి చేర్చినట్లు న్యాయపరమైన పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి.

పశ్చిమబంగాల్‌లో నిర్ణయం వెలువడిన అప్పీళ్లలో 90 శాతానికి పైగా పేర్లను పునరుద్ధరించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాల ఆధారంగా ఒక విశ్లేషణ పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా అనర్హులుగా అనుమానిస్తున్న నమోదులు కోట్లల్లో ఉన్నాయన్న అంశం ఓటరు జాబితాల ప్రక్షాళన ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నప్పటికీ, అర్హుల పేర్లు కూడా పొరపాటున గల్లంతయ్యే ప్రమాదాన్ని విస్మరించలేం.

ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సందేహాలు, ప్రశ్నలు 

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపైనా అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి నియామకం సేవా నిబంధనలు, పదవీకాలానికి సంబంధించిన 2023 చట్టంలో అనూప్ బరణ్వాల్ కేసులో సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన మధ్యంతర విధానాన్ని మార్చింది. గత విధానంలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతోపాటు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కూడా ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉండేవారు. అయితే 2023 చట్టం ప్రకారం సీజేఐ స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యుడిగా ఉండేలా మార్పు చేశారు. దీంతో ఎంపిక కమిటీలో ప్రభుత్వానికి 2:1 ఆధిక్యం లభించింది. ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన నేపథ్యంలో ఈ చట్టం ఆమోదం పొందింది.

ఈ కొత్త చట్టం కింద నియమితులైన తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ 2025 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు. ఈ చట్టం రాజ్యాంగబద్ధతతోపాటు, నిర్దిష్ట నియామకాలపై దాఖలైన సవాళ్లు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఎంపిక కోసం పేర్లను పరిశీలించే సెర్చ్ కమిటీ ప్రక్రియలో లోపాలు, పారదర్శకత కొరవడటం వంటి అంశాలను పిటిషనర్లు లేవనెత్తుతున్నారు.

‘సర్’ ప్రక్రియలో భారీగా ఓట్ల తొలగింపు, సంబంధిత ఉత్తర్వుల విషయంలో ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్లు బయటకు పొక్కడం, నియామక ప్రక్రియలో  మార్పులు-.. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై సందేహాలను పెంచుతున్నాయి. ఇదే అంశంపై ప్రతిపక్షాలు, మాజీ ఎన్నికల కమిషనర్లు, సాంకేతిక నిపుణులు, పౌరసమాజ సంస్థలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన సంస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లు పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ వివిధ వర్గాల నుంచి వినిపిస్తోంది.   

విశ్వసనీయతే సవాల్..

ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై సందేహాలు పెరుగుతున్నాయన్న భావన ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విస్తరిస్తోంది. జెన్-జెడ్, జెన్-ఆల్ఫా తరాలు ఈ చర్చలను ప్రధానంగా డిజిటల్ వేదికల ద్వారానే తెలుసుకుంటున్నాయి. దీంతో ఎన్నికల ప్రక్రియపై సంస్థాగత విశ్వాసాన్ని కాపాడటం మరింత కీలకంగా మారింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, సాంకేతిక నిపుణులు ‘సర్’ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని లేదా పునః రూపకల్పన చేయాలని సూచిస్తున్నారు.

ఓటరు జాబితాల ప్రక్షాళన ఎంత అవసరమో, పొరపాటున పేర్లు తొలగించబడిన వారికి సులభంగా అందుబాటులో ఉండే, నిర్ణీత గడువులో పరిష్కారం లభించే వ్యవస్థ కూడా అంతే అవసరం. ఎన్నికల జాబితాల్లో అక్రమాలను అరికట్టడం, అర్హుల ఓటు హక్కును కాపాడటం.. ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతకు పరీక్ష అని చెప్పవచ్చు.  

పీవీకి ఓట్ల వెల్లువ.. ఇబ్బందులు

రాజీవ్‌గాంధీ మరణం తర్వాత పీవీ నరసింహరావు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయనకు పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడిగా లేరు. నంద్యాల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పీవీ పోటీ చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తెలుగు స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకూడదని నిర్ణయించారు. తెలుగు బిడ్డ ఏకగ్రీవంగా గెలవాలన్నది ఆయన అభిప్రాయం. అయితే, ఫలితాల వెల్లడి సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు మాత్రం విచిత్రంగా మారాయి.

పీవీకి 90 శాతానికి మించి ఓట్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓట్ల లెక్కింపును మధ్యలోనే నిలిపివేయాలని అప్పటి ప్రధాన ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారిని ఆదేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. అంత భారీ శాతం ఓట్లు రావడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి, తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం తలెత్తుతుందన్నది ఇందుకు కారణంగా చెప్పబడింది.స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలంటే ఇదేనేమో! అభ్యర్థి మరీ ఎక్కువగా గెలుస్తున్నాడని ఓట్ల లెక్కింపును ఆపేయాల్సిన పరిస్థితి!

బ్యాలెట్ పత్రాల నుంచి బూత్‌ల ఆక్రమణ వరకు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా విచిత్రమైన ఘటనలు జరిగేవి. రాజకీయ పార్టీలకు చెందిన బలవంతులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి, బ్యాలెట్ పత్రాలను లాక్కొని, పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేవారన్న ఆరోపణలు వినిపించేవి. పద్ధతి ఎంత సమర్థవంతంగా కనిపించినా, ప్రజాస్వామ్య విలువలకు మాత్రం అది పూర్తి విరుద్ధం. 1977 లోక్‌సభ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ పార్టీకి మద్దతుగా నిలిచింది.

రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాల్లో 41 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. జనతా పార్టీ తరఫున నంద్యాల నుంచి పోటీ చేసిన నీలం సంజీవరెడ్డి ఒక్కరే కాంగ్రెస్ విజయ పరంపరకు అడ్డుకట్ట వేయగలిగారు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంత శాతం ఓట్లు ఇతరుల సహకారంతో వేయించారని, గణనీయమైన సంఖ్యలో ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకే రానివ్వలేదని ఆరోపణలు వచ్చాయి. దశాబ్దాలు మారినా, ఎన్నికల నిర్వహణ పద్ధతులు మారినా, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసే పరిస్థితులు మాత్రం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉన్నాయి.  కాలం మారింది. సాంకేతికత మారింది. 

కానీ ప్రజాస్వామ్యంలో ఓటరుకు దక్కాల్సిన గౌరవం, హక్కుల పరిరక్షణ విషయంలో మాత్రం ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.

ఒకప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్.. నేడు ఓటు హక్కుకే దూరం!

ఐదు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా ఓటు వేస్తూ వచ్చిన ఒక వృద్ధుడు,1980 చివర్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన అనుభవజ్ఞుడు.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? ఓటుకు నోచుకోలేని దుస్థితి ఎదురైతే! అదే ఇంట్లో, అదే చిరునామాలో నివసిస్తున్న ఆయన భార్యకు మాత్రం ఓటు వేసే అవకాశం ఉంది. బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) విచారణకు హాజరుకావాలని ఆయనకు సమన్లు పంపిస్తారు. ఆయన కూడా సమయానికి హాజరవుతారు.

బీఎల్‌ఓ కోరిన ప్రతి పత్రాన్ని వెంట తీసుకెళ్తారు. ఒక్కసారి కాదు, మూడుసార్లు వెళ్తారు. అయినా స్పందన శూన్యం. కనీస సమాచారం కూడా ఉండదు. ఆయన ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించే బాధ్యతలో ఉన్న యువ బీఎల్‌ఓ పుట్టకముందే, ఈ పెద్దమనిషి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఎన్నికల విధులు నిర్వర్తించారు. ప్రజాస్వామ్యంకూడా చిత్ర విచిత్రమైన పరిస్థితులను సృష్టిస్తుందేమో. అయితే గతాన్ని గుర్తుంచుకునే విషయంలో మాత్రం ప్రజాస్వామ్యానికి చాలా తక్కువ జ్ఞాపకశక్తి ఉన్నట్లుంది!

మరిన్ని వార్తలు