వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
గొల్లబుద్ధారంలో హత్య కలకలం
సంఘటన స్థలాన్ని సందర్శించిన భూపాలపల్లి డి.ఎస్.పి
భూపాలపల్లి, నవంబర్ 06 (విజయక్రాంతి): వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన గొల్లబుద్ధారం(Gollabuddaram)లో చోటుచేసుకుంది. ఈ హత్య ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామంలో కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన అజ్మీర చందునాయక్(39) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
స్థానికుల సమాచారం ప్రకారం హత్యకు గురైన చందునాయక్ భార్య పావనికి అదే గ్రామానికి చెందిన ధరావత్ సంతోష్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిసింది. సమస్యపై పంచాయతీ నిర్వహించేందుకు శుక్రవారం సమయం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చందునాయక్‌ను హత్య చేసేందుకు పావని, సంతోష్ పథకం వేశారు.
గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న చందునాయక్‌పై దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిలో తీసుకెళ్లి చికినపల్లి శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్‌రావు, భూపాలపల్లి, గణపురం సీఐలు శ్రీనివాస్, కరుణాకర్‌రావు, ఎస్సై పవన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.