ఇబ్రహీంపట్నంలో కల్తీ పాల దందా గుట్టురట్టు
ఒకరి పట్టివేత
100 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్
35 కిలోల పాలపొడి స్వాధీనం
ఇబ్రహీంపట్నం, నవంబర్ 06 (విజయక్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్(Police Commissionerate) పరిధిలోని మహేశ్వరం జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎస్ఓటి) ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది.
పట్టుబడిన వ్యక్తిని అండె శ్రీశైలం(43), పాల వ్యాపారి, పోచారం గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం నివాసిగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, శ్రీశైలం పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడి కలిపి కల్తీ చేసి హైదరాబాద్లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఈ నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు దాడి నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
దాడిలో స్వాధీనం చేసుకున్న సామగ్రి:
- 100 లీటర్ల కల్తీ పాలు
- 1 లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్
- 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లు (ఒక్కొక్కటి కిలో చొప్పున)
వ్యక్తితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార కల్తీ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కల్తీ పాల తయారీ, విక్రయాల గురించి సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు సూచించారు.