పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి, నవంబర్ 06 (విజయక్రాంతి): ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth) సూచించారు. శుక్రవారం ఆయన మొగుళ్లపల్లి పోలీస్‌స్టేషన్, చిట్యాల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉంటూ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సంకీర్త్ ఆదేశించారు.