గంజాయి వ్యసనానికి దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలి

06-11-2026 | 02:53pm

ఎస్పీ నితికా పంత్

ఆసిఫాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): గంజాయి వినియోగానికి అలవాటుపడిన వారు గతాన్ని పాఠంగా తీసుకొని భవిష్యత్తును సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ సహకారంతో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో గంజాయి వినియోగదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

వ్యసనానికి బానిసైన వారిని నేరస్థులుగా చూడకుండా, వారిలో మార్పు తీసుకువచ్చి సాధారణ జీవనంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గంజాయి మానేయాలనుకునే వారికి అవసరమైతే రిహాబిలిటేషన్ కేంద్రాల్లో వైద్య చికిత్స అందించేందుకు పోలీస్ శాఖ సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, డ్రగ్స్ రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే 1908 హెల్ప్‌లైన్ లేదా 8712671111 వాట్సాప్ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, టౌన్ సీఐ రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు