ఏసీబీకి చిక్కిన బజార్హత్నూర్ ఎస్సై
50 వేలు డిమాండ్ చేయగా 40 వేలకు ఒప్పందం..
యువతి ఆత్మహత్య కేసులో యువకుడిని ఇరికిస్తానని బెదిరింపు..
ఏసీబీని ఆశ్రయించిన యువకుడు...
బోథ్ నవంబర్ 4 (విజయక్రాంతి): బజార్ హత్నూర్ మండలంలోని మోర్ కండి గ్రామానికి చెందిన ఓ యువకుడు నుండి నలభై వేల రూపాయలు లంచంగా తీసుకుంటు ఉండగా బజార్హత్నూర్ ఎస్సై రమేష్(SI Ramesh)ను బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. అక్టోబర్ నెల మూడవ తేదీన మోర్ కండి గ్రామానికి చెందిన యువతి ఫోన్లో మాట్లాడుతుండగా కుటుంబీకులు మందరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ కేసును పోలీసులు విచారించి మూసివేయడం జరిగింది.
ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి ఓ యువకునితో మాట్లాడుతుందని తెలిసిన ఎస్సై సదరు యువకుడి ని పిలిచి గత పది రోజుల క్రితం ఆయన సెల్ ఫోను తీసుకోవడం జరిగింది. సెల్ ఫోన్ ఇవ్వడంతో పాటు కేసు నుండి తప్పించాలంటే 50 వేల రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశారని డి.ఎస్.పి తెలిపారు. దీంతో యువకుడు బుధవారం బజార్హత్నూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఎస్సైకి ఒప్పందం ప్రకారం 40 వేల రూపాయలు ఇచ్చారు. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని డిఎస్పి తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే 106 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని, లేదా 91 543 88963 నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే బాధితుని పేరు గోప్యంగా ఉంచి లంచం తీసుకునే అధికారులను పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.