కేంద్రాలు ప్రారంభాలు సరే.. దాన్యం కొనుగోళ్లేవి..?
- కేంద్రాల్లోనే ధాన్యం.. రైతు పరిస్థితి ధైన్యం..
- వర్షాలతో రైతులు ఆగమై.. ధాన్యం దళారులకు అమ్ముకుంటున్న వైనం..!
గంభీరావుపేట నవంబర్ 04(విజయ క్రాంతి ): ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలు పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. గంభీరావుపేట మండలంలో అధికారులు ప్రజా ప్రతినిధులు దాదాపు పది రోజులు క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికి మాత్రం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా దాదాపు 16వేల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తే ఇప్పటివరకు 30శాతం కోతలు కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు.మండలంలో మొత్తం 22గ్రామాలు ఉండగా 26 కొనుగోలు కేంద్రాలు కాగా ఐకెపి పరిధిలో 17 సెంటర్లు, గంభీరావుపేట సింగల్ విండో పరిధిలో 6, కొత్తపల్లి సింగల్ విండో పరిధిలో 3 కాగా రాజుపేటలో దాన్యం రాక ఇంకా ప్రారంభించలేదు.
కొనుగోలు కేంద్రాలకు స్థలాలు కరువు
కొనుగోలు కేంద్రాలలో సరైన స్థలాలు లేకపోవడంతో రోడ్ల వెంబడి ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసిపోతోంది. రోజుల తరబడి ఎదురుచూసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం వేయకపోవడంతో ఇప్పటికే సగం మంది రైతులు దళారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
అకాల వర్షాలతో అవస్థలు
ప్రతిరోజు మబ్బులు వస్తున్నడంతో మళ్లీ వర్షం ఎక్కడ పడుతుందోనని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఉదయం పూట ధాన్యాన్ని ఎండబోసి సాయంత్రం సమయంలో కుప్ప పోయాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. దళారుకు దొడ్డురకం పచ్చి వడ్లను రూ. 2100 సన్నరకం పచ్చి వడ్లకు రూ.2700 ల చొప్పున అమ్ముకుంటున్నారు.
కేంద్రాల్లో పోసి రోజుల తరబడి వేచి చూడడం ఎందుకని ఎక్కువ మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తొందరగా తూకం వేసి ధాన్యాన్ని తరలించాలని పలువురు అన్నదాతలు కోరుతున్నారు.