కండక్టర్ మృతి ఎఫెక్ట్.. TGSRTC కీలక ఆదేశాలు

04-11-2026 | 06:30pm

హైదరాబాద్: మణుగూరులో బస్ కండక్టర్ మృతి(Bus Conductor Death) ఘటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. బస్సుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా కొత్త మార్గదర్శకాలను స్పష్టం చేసింది.

బస్సు డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే వాహనాలను నడపాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. డోర్లు సరిగా పనిచేస్తున్నాయా? వాటిని సురక్షితంగా మూసే వ్యవస్థ ఉందా? అనే అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్లకు (TGSRTC Deputy RM) సూచించింది. సాంకేతిక లోపాలు గుర్తిస్తే వెంటనే మరమ్మతులు చేయించాలని స్పష్టం చేసింది.

ఈ భద్రతా చర్యలను కేవలం సంస్థ సొంత బస్సులకే పరిమితం చేయకుండా అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులకూ(Electric Buses) వర్తింపజేయాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ పరిధిలో నడుస్తున్న అన్ని రకాల బస్సుల్లో డోర్ల పనితీరును పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మణుగూరు(Manuguru) ఘటనతో బస్సుల నిర్వహణ, ప్రయాణ సమయంలో భద్రతా ప్రమాణాలపై మరోసారి దృష్టి సారించిన ఆర్టీసీ.. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. బస్సు బయలుదేరే ముందు డోర్ల పరిస్థితిని నిర్ధారించుకోవడం, లోపాలున్న వాహనాలను సరిచేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యం సూచించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని డిపోల పరిధిలో ఈ ఆదేశాలు అమలయ్యేలా పర్యవేక్షణ చేపట్టనుంది.

మరిన్ని వార్తలు