ఫుడ్ సేఫ్టీ దాడులు.. వ్యాపారుల్లో కలవరం

04-11-2026 | 05:19pm

నిజామాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార వ్యాపారులపై టీజీ ఫుడ్(TG Food Safety) సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. జిల్లావ్యాప్తంగా స్వీట్ షాపులు, బేకరీలు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 28 ఆహార తయారీ కేంద్రాలను తనిఖీ చేయగా, నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో సుమారు 9,645 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.

తనిఖీల సందర్భంగా పలు సంస్థల్లో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల అపరిశుభ్రమైన వంటగదులు, కుళ్లిన కూరగాయలు కనిపించాయి. ఆహార నాణ్యతపై అనుమానాలు రావడంతో మొత్తం 26 శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపించారు. వీటి ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అనుమతులు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని బేకరీలపై అధికారులు చర్యలు చేపట్టి వాటిని సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన 13 ఆహార సంస్థల లైసెన్సులను(Food business licenses) సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. మరో 12 సంస్థలకు ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆహార తయారీ, నిల్వ, విక్రయాల్లో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా స్వీట్ షాపులు, బేకరీలు, హోటళ్ల నిర్వాహకులు పరిశుభ్రతతో పాటు లైసెన్సులు, ఆహార భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు