రాబందుల సర్కార్

02-11-2026 | 05:25am

రైతుల రక్తమాంసాలు పీలుస్తున్న కాంగ్రెస్

  1. ‘రైతుబంధు’ బంద్.. రాహుల్ ఖాతా కంటిన్యూ 
  2. కరువుకు ముఖ్యమంత్రిదే బాధ్యత
  3. దివానాగాళ్లకు ఓటేస్తే రాష్ట్రం దివాలా 
  4. బడే మియా, చోటే మియా కలిసి దోపిడీ    
  5. చంద్రబాబుకు రేవంత్ గులాం   

ఆదిలాబాద్ రైతు గర్జనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఆదిలాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని రాబందుల ప్రభుత్వం ఏలుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. రైతుల రక్తమాంసాలను పీల్చుకుతింటూ వారి జీవితాలపై కాంగ్రెస్ సర్కా రు మరణశాసనం రాస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు బంద్.. బోనస్ బంద్.. నీళ్లు బంద్.. కరెంటు బంద్.. కార్ఖానాలు, కంపెనీలు బంద్ అయ్యాయని, చివరకు వ్యవ సాయమే బంద్ చేసే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దివానాగాళ్లకు ఓటేస్తే రాష్ర్టం దివాలా పరిస్థితికి చేరిందని, మోసపోయి ఓటేస్తే గోసపడతారని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయని పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని డైట్ మైదా నంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘రైతుబంధు బంద్..

రాహుల్ ఖాతా మాత్రం కొనసాగుతు న్నది. బడే మియా.. చోటే మియా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు ప్రస్తుత యాసంగి పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున ప్రతి రైతు ఖాతాలో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.

రైతులతో పాటు రైతు కూలీలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి కరువు పరిస్థితులు లేవని, అన్ని వనరులు,

సాగునీటి అవకాశాలు అందుబాటులో ఉన్న తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని విమర్శించారు. ఎల్ నినో పేరు చెప్పి బాధ్యత నుంచి తప్పించుకునే పరిస్థితి లేదని, రాష్ర్టంలో నెలకొన్న కరువుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతుబంధు అందిస్తే, తాము అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. హామీ నెరవేర్చకుండా రైతులను మోసం చేసిన దుర్మార్గుడు ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు.

అంతేకాకుండా రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చిందని, 2022 మే 6న వరంగల్ సభలో రాహుల్‌గాంధీ రైతులకు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతుబంధు ఏమైంది? తులం బంగారం ఏమైంది? ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏమైంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందన్నారు.

21 లక్షల మంది రైతులకు రైతుబంధు అమలు చేయాలని, కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 36 వేల మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నేడు రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలు వేయడానికి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారని, దుక్కి దున్నొద్దు.. భూములను పడావు పెట్టుకోవాలని చెప్పే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రైతులకు ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. ఢిల్లీకి మాత్రం క్రమం తప్పకుండా డబ్బుల మూటలు పంపుతుందని విమర్శించారు. 

రాష్ట్రాన్ని నడుపుతున్నది నల్లమల పిల్లి..

రాష్ట్రాన్ని నడుపుతున్నది నల్లమల పిల్లి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో అన్ని రంగాలకు హాలిడే ప్రకటించినట్లుగా పాలన సాగుతోందని విమర్శించారు. మంచిగా ఉన్న విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని, పరిశ్రమలు మూతపడే పరిస్థితి తీసుకొచ్చిందని మండిపడ్డారు.

రైతులకు సాగునీరు లేదు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, ప్రోత్సాహం లేదు.. రాష్ర్టం అన్ని రంగాల్లో సంక్షోభం ఎదుర్కొంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికే హాలిడే ప్రకటిస్తే ప్రజల గోస తీరుతుందనే విధంగా రాష్ట్రంలో పరిస్థితి తయారైందన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువు, కన్నీళ్లు, వలసలు అని, కరువు రాక్షసిని రేవంత్‌రెడ్డి మళ్లీ తెలంగాణకు తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు.

కేసీఆర్ పాలనలో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేదని, రైతులు పుట్లకొద్దీ వడ్లు పండించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం రైతులు పంటలు వేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.

లక్ష క్యూసెక్కుల నీళ్లు వృథా..

గోదావరి జలాలను వినియోగించుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. 750 టీఎంసీల నీళ్లు వచ్చినా ఒక్క చుక్క కూడా ఎత్తిపోయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నా వాటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కన్నెపల్లి దగ్గర నీళ్లు ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించగా, వారికి బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్నట్లుగా రేవంత్ మాట్లాడారని ఆరోపించారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి.. పంటలు పండితే కొనుగోలు చేయాలి.. రైతులకు బాధ్యతగా అండగా నిలవాలి. ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

‘అచ్చ, పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చా కాంగ్రెస్’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు గులాంగా మారారని ఆరోపించారు. చంద్రబాబు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తుంటే తెలంగాణలో మాత్రం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.  

ఆ రెండు ప్రాజెక్టులు వినియోగిస్తే ఒక్క ఎకరం కూడా ఎండకపోయేది..

కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సక్రమంగా వినియోగించుకుని ఉంటే తెలంగాణలో ఒక్క ఎకరం కూడా ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరువుకు కల్పతరువు లాంటిదని, రాజకీయ కక్షతో వ్యవహరించకుండా రైతుల ప్రయోజనాల కోసం దానిని ఉపయోగించుకోవాలని సూచించారు.

బీఆర్‌ఎస్ హయాంలో చనాకా--కొరాటా ప్రాజెక్టు ట్రయల్ రన్ పూర్తయిందని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల నిర్మాణం చేపట్టడం లేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.. కాంగ్రెస్ అంటే కరువు అని వ్యాఖ్యానించారు.

ఆదిలాబాద్‌లో పరిశ్రమలు నిర్వీర్యం..

కొమురం భీమ్ పుట్టిన గడ్డ, తెలంగాణ కశ్మీర్‌గా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగగా, కాంగ్రెస్ సర్కార్ ఆగం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలను కాపాడడంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు విఫలమయ్యారని విమర్శించారు.

ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి, తుక్కు కింద మార్చి విక్రయించే పరిస్థితి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇక్కడి పరిశ్రమలను గుజరాత్‌కు తరలిస్తున్నా ఆదిలాబాద్  కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతానికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జాతీయ విద్యాసంస్థలు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా మోదీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీ.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేసి 13 ఏళ్లు గడిచినా తెలంగాణకు, ఆదిలాబాద్‌కు ఏం మేలు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీస్తోందని విమర్శించారు. బొగ్గు కుంభకోణాలతో సంస్థను దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ర్టంలో పారిశ్రామిక వాతావరణానికి సైతం ప్రభుత్వం విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు. 

బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలు..

బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలని.. తెలంగాణలో రెండు పార్టీలు పరస్పరం పోరాడుతున్నట్లు నటిస్తాయని, ఢిల్లీలో మాత్రం కలిసి పనిచేస్తాయని కేటీఆర్ ఆరోపించారు. బడేభాయ్, చోటేభాయ్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని.. జుమ్లా, హమ్లా అని ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులపై బీజేపీ నాయకులు రేవంత్‌రెడ్డిని గట్టిగా నిలదీశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బూతులు మాట్లాడటం తప్ప మరేమీ చేతకాదని విమర్శించారు.రైతులు అధైర్యపడవద్దని, ఒక్క సంవత్సరం ధైర్యంగా ఉండాలని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, రైతులను తిరిగి ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.  

బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం

జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా తలమడుగు మండలానికి చేరుకున్న కేటీఆర్.. ఇటీవల బోథ్ నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. నలుగురు రైతు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే ఇటీవల రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు పసికందుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అంతకుముందు రైతు గర్జన సభకు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

కేటీఆర్ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ.. ప్రసంగం మధ్యలో గూడ అంజన్న, కాళోజీ నారాయణ, సామల సదాశివ మాస్టర్ పాటలు, కవితలను వినిపించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను భారీ తెరపై ప్రదర్శిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, గంప గోవర్దన్, కోనప్ప, జాజుల సురేందర్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ, నాయకులు భార్గవ్ దేశ్‌పాండే, జాన్సన్ నాయక్, చంటి క్రాంతి, జనార్దన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు