జనంలోకి కేటీఆర్!
- మార్చి నుంచి మహా పాదయాత్ర
- రాష్ట్రవ్యాప్త పర్యటనకు బీఆర్‌ఎస్ స్కెచ్
- జిల్లాల వారీగా రూట్ మ్యాప్
- ప్రజా సమస్యలే ప్రధాన అజెండా
- రైతులు, యువత, నిరుద్యోగులతో ముఖాముఖి
- క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణంపైనా దృష్టి
- కేసీఆర్ బస్సు యాత్రపై కూడా సమాలోచనలు
- 2028 ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) సరికొత్త రాజకీయ సమరానికి బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు, క్యాడర్‌లో నూతనోత్సాహం నింపే దిశగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కీలక అడుగు వేయబోతున్నా. వచ్చే మార్చి నుంచి ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్‌పై పార్టీ అగ్రనాయకత్వం కసరత్తు ప్రారంభించింది. యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఏయే జిల్లాల మీదుగా సాగాలి? ప్రజల్లోకి ప్రధానంగా ఏ అంశాలను తీసుకెళ్లాలి? అనే కోణంలో బీఆర్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2027లో పాదయాత్ర చేస్తానని కేటీఆర్ గతంలో ప్రకటించిన నేపథ్యంలో,
ఇప్పుడు మార్చి నుంచే దానికి ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు. అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీ చేపట్టబోయే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఇదే కానుంది. పదేళ్ల పాలన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికల్లోనూ పరాభవం తప్పలేదు.
ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ దూకుడు, మరోవైపు బీజేపీ విస్తరణ ప్రయత్నాల మధ్య బీఆర్‌ఎస్ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ఇప్పటి వరకు విమర్శలు, ధర్నాలు, అసెంబ్లీలో నిరసనలు, ప్రెస్‌మీట్లకే పరిమితమైన గులాబీ పార్టీ.. ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పాదయాత్ర ద్వారా అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ఇటు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే యోచనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేస్తూ, రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని బీఆర్‌ఎస్ చేతుల్లోకి తీసుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. త్వరలోనే ఈ పాదయాత్రకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
క్యాడర్, ప్రజలతో మమేకం
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పార్టీకి, ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగిందని కేటీఆర్ గతంలోనే అంగీకరించారు. ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలను నాయకత్వం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను కేవలం రాజకీయ ప్రచార కార్యక్రమంగా కాకుండా పార్టీకి, ప్రజలకు మధ్య సంబంధాలను పునరుద్ధరించే వేదికగా మలచాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రామాల్లో పర్యటించడం, ప్రజలతో ముఖాముఖి, స్థానిక సమస్యలు తెలుసుకోవడం, కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించడం వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, కార్యకర్తల స్పందనను అంచనా వేసేందుకు కూడా పాదయాత్ర దోహదపనుంది.
ఈ క్రమంలో పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ రూపకల్పనపై బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏయే ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలన్నది కూడా నిర్ణయించనున్నారు. ఆయా ప్రాంతాల్లో రాజకీయ ప్రత్యేకత, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రైతులు, సాగునీటి సమస్యలు తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని ఎక్కడి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టాలన్నది పార్టీ యోచిస్తోంది.
రూట్ మ్యాప్ ఖరారైన అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. యాత్రకు ముందుగానే స్థానికంగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేయడం, ప్రజా సమస్యలపై నివేదికలు సిద్ధం చేయనున్నారు.
ఈ అంశాలపై ఎక్కువగా ఫోకస్!
సాగు, తాగునీరు, విద్యుత్, ఎరువుల లభ్యత, పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ, రైతుభరోసాతో పాటు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం మరమ్మతులు, పెండింగ్ అభివృద్ధి పనుల వంటి అంశాలపై పాదయాత్రలో ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు. అలాగే రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం, వ్యవసాయ క్షేత్రాల సందర్శన, రైతు కుటుంబాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకునే ఛాన్స్ ఉంది.
అదే సమయంలో యువత, నిరుద్యోగులతోనూ ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తదితర అంశాలపై ఆయా వర్గాల అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు, స్వయం సహాయక సంఘాల సమస్యలు, మహిళా సాధికారత, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సైతం పాదయాత్రలో ప్రస్తావించే అవకాశం ఉంది.
పార్టీ పునర్నిర్మాణానికి పాదయాత్ర వేదిక
పాదయాత్రలో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైనా కేటీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలను యాక్టివ్ చేయడం, బూత్ స్థాయి నెట్‌వర్క్ పటిష్టం, యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు కీలకం కానున్నాయి.
ప్రతి జిల్లాలో స్థానిక నాయకత్వతో సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, కార్యకర్తల సమస్యలను తెలుసుకోవడం, నాయకత్వంపై వారి అభిప్రాయాలను స్వీకరించాలనే భావనలో కేటీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా వచ్చే ఏడాది ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారని, ఇందుకోసం బస్సు యాత్ర చేపట్టనున్నారని పార్టీ వర్గాల్లో సమాచాలోచనలు జరుగుతున్నాయి. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక వ్యూహాలతో ముందస్తుగానే సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మహా పాదయాత్రపై చర్చ మొదలైంది.