హైదరాబాద్‌కు అమిత్ షా.. భారీ పాదయాత్ర

02-11-2026 | 06:35am

SIRపై రాజకీయ సమరం.. హైదరాబాద్‌కు అమిత్ షా.. బీజేపీ భారీ పాదయాత్ర!

హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశం దేశ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో భారీ పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పర్యటనతో నగరంలో Political Heat పెరిగింది.

ఇటీవల ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఓట్ బచావో' ర్యాలీలో కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని రాహుల్ హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న పాదయాత్ర, బహిరంగ సభకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ ఆరోపణలకు అమిత్ షా తన ప్రసంగం ద్వారా ఎలాంటి సమాధానం ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. SIRపై బీజేపీ వైఖరిని ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

బషీర్‌బాగ్ నుంచి MJ మార్కెట్ వరకు పాదయాత్ర

సోమవారం మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి బీజేపీ పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మొజంజాహి మార్కెట్ (MJ Market) వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లనున్నారు. యాత్ర ముగిసిన అనంతరం MJ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ Public Meetingలో అమిత్ షా ప్రసంగించనున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆదివారం స్వయంగా పాదయాత్ర మార్గాన్ని పరిశీలించారు. రూట్ మ్యాప్, Security Arrangements, వాహనాల రాకపోకలు, బహిరంగ సభ వేదిక తదితర అంశాలపై పార్టీ నేతలు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను వేగవంతం చేశారు.

వేలాదిగా తరలిరానున్న కార్యకర్తలు?

ఈ పాదయాత్రలో న్యాయవాదులు, వైద్యులు, మేధావులు, విద్యార్థులతో పాటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పడంతో పాటు ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా SIR అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ విమర్శలు హైదరాబాద్ వేదికగా మరోసారి తెరపైకి రానున్నాయి. అమిత్ షా ప్రసంగంలో ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారు? కాంగ్రెస్ విమర్శలకు ఎలాంటి Political Counter ఇస్తారు? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు