20కోట్ల ఓట్లు తొలగించే కుట్ర

02-11-2026 | 05:20am
  1. ఇప్పటికే 13.50 కోట్ల ఓటర్ల పేర్లు తీసేశారు
  2. పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలపై మోదీ కక్ష
  3. ఆయనను గద్దె కూలక తప్పదు:  సీఎం రేవంత్‌రెడ్డి
  4. ఢిల్లీలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ర్యాలీకి హాజరు

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి మొదటి రెండుసార్లు మోదీ అధికారంలోకి(Modi's Power) వచ్చారని.. 2024 ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేయాలని భావించారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. ‘బీజేపీకి 400 సీట్లు దాటితే రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు హక్కును తొలగిస్తారని తెలుసుకున్న ప్రజలు ఆ సంఖ్యను ఇవ్వలేదు. దీంతో పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలపై మోదీ కక్ష పెంచుకున్నారు.

అందుకే ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13.50 కోట్ల ఓటర్లను జాబితా నుంచి తీసేశారు. ఇంకా 20 కోట్ల మంది పేర్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారు’ అని ఆయన దుయ్యబట్టారు.

ఆదివారం ఇండీ కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో చేపట్టిన ‘ఓటు బచావో... దేశ్ బచావో’ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ సభకు ముందుగా ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రం నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

తెలంగాణ బలం ముందు తలవంచిన మోదీ

భారతదేశంలోని ప్రతి పౌరుడికి అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారని, కానీ ఆ ఓటు హక్కును తొలగించేందుకు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అడ్డుపెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొత్తం ఓటర్లలో 15 నుంచి 20 శాతం మంది పేర్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

ప్రయోగాత్మకంగా ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో ఓట్ల తొలగింపు ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేసుకున్నారని, ఢిల్లీలోనూ మరోసారి అలానే అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఈ కుట్రను ఎదుర్కొనేందుకు పోరాటం చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని తెలిపారు.

రామ్‌లీలా మైదాన్ సభకు తెలంగాణ నుంచి 15 వేల మంది వచ్చేలా పీసీసీ ఆధ్వర్యంలో రైళ్లు ఏర్పాటు చేస్తే, ఆఖరి నిమిషం వరకు నమ్మించి చివర్లో రైళ్లు రద్దు చేసి కార్యకర్తలను రాకుండా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. రైళ్లు ఇవ్వకపోయినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా ఢిల్లీ వచ్చారని.. కార్యకర్తల సంకల్పాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్ అడ్డుకోలేకపోయారని అన్నారు. తెలంగాణ బలం ముందు, తెలంగాణ గళం ముందు మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్ తలవంచక తప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. 

నాటి వానర సైన్యంలా..!

నాడు రావణుడిని ఓడించేందుకు రాముడికి వానర సేన తోడ్పడినట్లు.. నేడు నరేంద్ర మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ వానర సైన్యం పోరాడుతున్నదని, ఇందులో విజయం సాధించే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల దీక్షతో నరేంద్ర మోదీ గద్దె కూలక తప్పదని  హెచ్చరించారు.

తెలంగాణభవన్‌లో మాట్లాడిన అనంతరం సీఎం  రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో రామ్‌లీలా మైదాన్‌కు వెళ్లారు.  

మరిన్ని వార్తలు