మోదీ.. కాస్కో!
జ్ఞానేశ్‌కుమార్ తర్వాత నీ వంతే.. ఓట్ల దొంగలను వదిలిపెట్టబోం
రామ్‌లీలా మైదాన్ సభా వేదికగా రాహుల్‌గాంధీ హెచ్చరిక
- 2024 ఎన్నికల్లోనూ అక్రమ విజయం
- మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కలిసి భారీ కుట్ర
- ప్రజల గొంతును, దేశ ఆత్మను చంపే యత్నం
- ఆ ముగ్గురూ ఏ నాటికీ తప్పించుకోలేరు
- అన్ని వ్యవస్థలపై ఆర్‌ఎస్‌ఎస్ ఆధిపత్యం
- యువతకు ఉద్యోగాల్లేవ్.. రైతులకు గిట్టుబాటు లేదు
- అంబానీ, అదానీకి ఆమ్దానీ వస్తే చాలన్నట్లు మోదీ పాలన
- మేం ఎవరినీ శత్రువులుగా చూడం.. అందరినీ ప్రేమిస్తాం
- ప్రజాస్వామ్య పరిరక్షణే తమ లక్ష్యమన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత
- ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరిట ఇండీ కూటమి ర్యాలీ, సభ
- పాల్గొన్న మమత, అఖిలేశ్, తేజస్వీ, మహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా, ప్రజా సంఘాల నేతలు
- ఖర్గే, సోనియా, ప్రియాంక, తెలంగాణ సీఎం రేవంత్ సైతం హాజరు
న్యూఢిల్లీ, నవంబర్ 1: ఇండీ కూటమి ర్యాలీతో(INDIA alliance rally) ఢిల్లీ వీధులు దద్దరిల్లాయి. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదాలు మార్మోగాయి. ఓట్ చోరీకి, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు(CEC Gyanesh Kumar) వ్యతిరేకంగా ఆదివారం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి భారీ మార్చ్, సభ ఏర్పాటు చేసింది. దేశం నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కన్నాట్ ప్లేస్ నుంచి ప్రారంభ మైన ర్యాలీ.. రామ్‌లీలా మైదాన్ వరకు సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘2024 ఎన్నికల్లోనూ ఓట్ చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కలిసి భారీ కుట్ర చేశారు.
ఇందుకు పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. జ్ఞానేశ్‌ను జైలుకు పంపాలని యావత్ దేశం నినదిస్తున్నది. ఆయన దిగిపోవాల్సిందే. ఆ తర్వాత మోదీ, అమిత్ షా వంతే. మోదీ.. కాస్కో! మీరు ఎక్కడికీ పారిపోలేరు. ప్రజల నుంచి తప్పించుకోలేరు. ఓట్ల దొంగలను వదిలిపెట్టబోం. చట్టబద్ధంగా చర్యలు తప్పవు’ అని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని బీజేపీ లూటీ చేసిందని, ఆ పార్టీ హటావో నినాదంతో ఉద్యమిద్దామని టీఎంసీ అధ్యక్షురాలు, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు మాత్రమే ఈ దేశంలో పౌరులుగా, ఓటర్లుగా ఉండాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేతలంతా ఒకే వాహనంలో..
ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్డు కన్నాట్ ప్లేస్ నుంచి ర్యాలీ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న రామ్‌లీలా మైదాన్ వరకు సాగింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఐ నేత రాజా కలిసి ఓపెన్ టాప్ జీపులో ర్యాలీకి బయలుదేరారు.
మిగతా నేతలు విడిగా వాహనాల్లో వచ్చారు. అంతకుముందే భారీగా నేతలు, కార్యకర్తలు రామ్‌లీలా మైదాన్‌కు చేరుకున్నారు. ర్యాలీ పొడవునా ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’.. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదాలు మార్మోగాయి. ర్యాలీ ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..
కన్నాట్ ప్లేస్‌లో దుకాణాలను బలవంతంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూసివేయించారని, నిరసనలకు ఆయన భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. వ్యాపారులకు ఇబ్బందులు కలగొద్దని, సభకు హాజరయ్యేవారంతా ఆ దుకాణాల్లో షాపింగ్ చేయాలని తాము ఇప్పటికే పిలుపునిచ్చామని.. కానీ, అమిత్ షా కుట్ర చేసి మూసివేయించారని ఆయన దుయ్యబట్టారు.
భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు..
రామ్‌లీలా మైదాన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ సహా ఇండీ కూటమిలోని ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆయా పార్టీల పాలిత రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, కీలక నేతలు కూడా హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
సభా వేదికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా కీలక నేతలు కూర్చున్నారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ పదవి నుంచి దిగిపోవాల్సిందేనని, ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి విచారించాల్సిందేనని వారు ముక్తకంఠంతో నినదించారు.