దూసుకొస్తున్న 'మురసు' తుఫాన్

02-11-2026 | 06:45am

ఏపీ తీరానికి మురసు తుపాను.. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం!

అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న మురసు (Cyclone Murasu) తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు వేగంగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ–వాయువ్య దిశగా ప్రయాణించినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. నవంబర్ 1 అర్ధరాత్రి విడుదల చేసిన తాజా Bulletin ప్రకారం, తుపాను కేంద్రం 13.3 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83.0 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది.

ప్రధాన నగరాలకు ఎంత దూరంలో ఉందంటే?

తుపాను కేంద్రం చెన్నైకి తూర్పున 300 కిలోమీటర్లు, నెల్లూరుకు తూర్పు–ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, కావలికి 370 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 380 కిలోమీటర్లు, ఒంగోలుకు ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణంగా 490 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు IMD తెలిపింది. రాబోయే మూడు గంటల్లో మురసు తీవ్ర తుపానుగా (Severe Cyclonic Storm) బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 2 అర్ధరాత్రి 11:30 గంటల నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున 4 గంటల మధ్య నెల్లూరు–నరసాపురం మధ్య, ఒంగోలు సమీపంలో ఏపీ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది.

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు!

తుపాను Landfall సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అప్పుడప్పుడు గాలుల వేగం 120 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. మురసు తుపాను కదలికలు, తీరం దాటే ప్రాంతంపై అధికారులు నిరంతరం Monitoring కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు