దీపావళికైనా ఉండేనా?
కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహుల ఎదురుచూపులు
- పండుగల పేరుతో వాయిదాల మీద వాయిదాలు
- ఇప్పుడు‘సర్’పై పోరాటంలో అధిష్ఠానం బిజీ
- ప్రభుత్వానికి ఇక మిగిలింది రెండేండ్ల కాలమే మూడేండ్ల కాలంలో పూర్తిగా
- భర్తీకి నోచుకోని పదవులు శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లో(Congress) పదవుల పంపకం(Distribution of positions) వాయిదాల మీద వాయిదా పడుతున్నది. ఆ పండుగ, ఈ పండుగ అంటూ పండుగల పేరుతో .. ఆశావహులకు ఆశలు చూపిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై గతంలో సంక్రాంతి అన్నారు.. ఆ తర్వాత ఉగాది పండుగ అని చెప్పారు.
ఇటీవలే దసరా కూడా ముగిసింది. ఇప్పుడు దీపావళి సైతం దగ్గరకు వస్తున్నది. అయినా పార్టీలో, ప్రభుత్వంలో పదవుల భర్తీ మాత్రం పూర్తి చేయడం లేదు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పలుమార్లు చెప్పిన తేదీల్లోనూ పదవులు భర్తీకాక పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నది. దీపావళి పం డుగ తర్వాతైనా పదవుల జాతర ఉం టుందా..? లేకపోతే మరోసారి వాయిదాపడుతుందా..? అని వారు చర్చించు కుంటున్నారు.
ఎందుకంటే.. ‘సర్’కు, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం నేతృత్వంలో ఇండీ కూటమి పెద్దఎత్తున పోరాటం చేస్తున్న ది. ఆ ఉద్యమంలో కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు నేతలందరూ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోని కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్లి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
ఇలాంటి కీలక సమయంలో పదవుల భర్తీకి అధిష్టానం నుంచి అనుమతి వస్తుందా..? అనేది చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటికే మూడు బెర్తులు ఖాళీగా ఉ న్నాయి. ఇక, పార్టీ పదవుల విషయానికి వస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు, ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌తో పీసీసీ కార్యవర్గంలోనూ పదుల సంఖ్యలో పదవులు ఖాళీగా ఉన్నాయి. పీసీసీకి అనుబంధంగా ఉండే కొ న్ని విభాగాలకు కూడా కార్యవర్గాలను భర్తీ చేయాల్సి ఉంది.
ఖాళీలు అనేకం..!
నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే ఇటీవలనే 37 మందికిపైగా చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. ఖాళీ అయిన పోస్టులతోపాటు అదనంగా 50 నామినేటెడ్ పదవులతో కలిపి మొత్తం 87 పోస్టుల వరకు భర్తీ చేయాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ప్రధానంగా.. ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లయ్స్, హౌసింగ్ కార్పొరేషన్,
మూసీ రివర్‌ఫ్రంట్, పారిశ్రామిక మౌలిక సదుపాయా ల కల్పన, మత్స్య సహకార సంఘాల సమా ఖ్య, ఆగ్రో ఇండస్ట్రీస్ , పర్యాటకాభివృద్ధి, ఫుడ్స్ కార్పొరేషన్, రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ది సంస్థ (రెడ్‌కో), గిడ్డంగుల సంస్థ , ఖనిజాభివృద్ధి, అటవీ అభివృద్ధి సంస్థ, ఆయిల్‌ఫెడ్, విత్తనాభివృద్ది, రోడ్డు అభివృద్ది, ఎంబీసీ కార్పొరేషన్, రైతు కమిషన్, క్రీడా ప్రాధికారిక సంస్థతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు.. ఇలా చాలా సంస్థలకు పాలక వర్గాలను నియమించాల్సి ఉంది.
ఇందులో అనేక సంస్థలకు డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఖాళీగా ఉన్న వాటిలో కొన్నింటికి చైర్మన్, ఉప చైర్మన్ పదవులతోపాటు డైరెక్టర్ పదవులు భర్తీ చేస్తే వేలాది మంది నేతలకు, కార్యకర్తలకు పదవులు ఇచ్చి సంతృప్తి పర్చేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
మిగిలింది రెండేండ్ల కాలమే..!
ప్రభుత్వం అభివృద్ధితోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అప్పటి అధికార బీఆర్‌ఎస్‌కు ధీటుగా నిలబడి కొట్లాడిన నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడు సరైన గుర్తింపు దక్కడం లేదని చర్చ ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేండ్లవుతున్నా.. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పదవులు భర్తీ చేయడం లేదని, ఒకవేళ కొన్నింటిని భర్తీ చేసినా ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారని, మొదటి నుంచి కష్టపడిన వారిని గుర్తించడం లేదనే విమర్శలు నేతల్లో ఉన్నాయి.
పార్టీ పదవుల విషయంలో నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య పంచాయితీలు కూడా నడుస్తున్నాయి. అయితే పార్టీ, ప్రభుత్వ పదవుల్లో పాత నాయకులకు 60 శాతం, ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి 40 శాతం లెక్కన పదవులు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పలుమార్లు ప్రకటించినా..
పూర్తిగా అమలు కావడం లేదనే విమర్శలూ కేడర్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు దగ్గరకు వస్తుండటంతో ఇంకా మిగిలింది రెండేండ్ల కాలపరిమితే. ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించాలని ఆశావాహులు కోరుతున్నారు. లేదంటే రెండేండ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.