రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు
ఉట్నూర్, అక్టోబర్ 28( విజయక్రాంతి ): ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ, ఖోఖో పోటీల్లో విజయం సాధించిన స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel ) అభినందించారు. ఈ సందర్భంగా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు తో కలిసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విజేత విద్యార్థులను అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం గర్వకారణమని అన్నారు. క్రీడల్లో రాణిస్తూనే విద్యారంగంలోనూ ఉత్తమ ఫలితాలు సాధించి మన ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదలతో నిరంతరం సాధన చేస్తూ భవిష్యత్తులో జాతీయ,
అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ విజేత విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.