ధన్నూరాబిలో విట్టల్ రుక్మిణి బాయి ఆలయంలో పూజలు
ఉట్నూర్, నవంబర్ 24 (విజయక్రాంతి): కాకతీయ రాజుల కాలంలో ఇంద్రవెల్లి మండలం ధన్నూరాబి గ్రామంలో కొలువుదీరిన విట్టల్ రుక్మిణి బాయి దేవతల ఆలయం కార్తీక మాస పూజల ముగింపునకు ముస్తాబైంది. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు (Special Poojas) నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవతలకు విశేష పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు.
79 ఏళ్లుగా హరి కీర్తనల బోధన
ధన్నూరాబి గ్రామంలోని విట్టల్ రుక్మిణి బాయి ఆలయం వద్ద గత 79 ఏళ్లుగా ప్రతి సంవత్సరం వారం రోజులపాటు హరి కీర్తనలు (Hari Kirtans) బోధిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర నుంచి మహారాజులు వచ్చి మరాఠీ భాషలో హరినామ స్మరణ చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు (Spiritual Teachings) చేస్తున్నారు. హరి కీర్తనలను వినేందుకు ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ తదితర మండలాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.