ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం
డిపాజిటర్లు, బాధితులు, ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీల్లో అవసరమైన పత్రాలతో హాజరుకావాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24, (విజయక్రాంతి): ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు(AgriGold Depositors), బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , భద్రాచలం పరిధిలోని ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ, వివరాల నమోదు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుందనీ ఎస్పీ రోహిత్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రక్రియ కోసం కొత్తగూడెంలోని హేమచంద్రపురం జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి పని దినం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ధృవీకరణ జరుగుతుంది. మండలాల వారీగా కేటాయించిన షెడ్యూల్ ప్రకారం రోజుకు మొదటి 250 మంది డిపాజిటర్ల పత్రాలను మాత్రమే పరిశీలిస్తారు. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే 8712682128 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
ధృవీకరణకు తీసుకురావాల్సిన ముఖ్యమైన పత్రాలు:
1. అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ / నగదు రసీదు.
2. బాండ్‌కు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ జిరాక్స్.
3. ఆధార్, పాన్ కార్డు జిరాక్స్.
4. బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ (పేరు, ఖాతా నంబర్, IFSC స్పష్టంగా ఉండాలి).
5. తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
6. డిపాజిటర్ / నామినీ / చట్టబద్ధ వారసుని మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్.
7. డిపాజిటర్ మరణించిన సందర్భంలో మరణ ధృవీకరణ పత్రం, నామినీ లేదా చట్టబద్ధ వారసునికి సంబంధించిన ఆధారాలు.
8. డిపాజిటర్ స్వయంగా హాజరుకాలేని సందర్భంలో కుటుంబ సంబంధ ధృవీకరణ పత్రం, అధికార పత్రం (Authorization Letter).
9. ఏజెంట్లు తమ ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఫోటో, మొబైల్ నంబర్, ఏజెంట్ కోడ్ సమర్పించాలి.
ముఖ్య సూచనలు:
అసలు బాండ్లను అధికారులకు అప్పగించకూడదు. ధృవీకరణ కోసం మాత్రమే చూపించాలి.
కలర్ జిరాక్స్‌పై సంబంధిత వ్యక్తి సంతకం తప్పనిసరిగా ఉండాలి.
బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
ఏజెంట్ వివరాలు తెలియకపోతే 'తెలియదు / అందుబాటులో లేదు' అని పేర్కొనవచ్చు.
కావున ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు, ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీలను గమనించి, అవసరమైన పత్రాలతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ధృవీకరణ కేంద్రానికి హాజరై నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.