ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయం
కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి...
కొత్తగూడెం అక్టోబర్ 15 విజయ క్రాంతి: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా(Bharatiya Janata Party SC Morcha) జిల్లా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ బాబు ఆధ్వర్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయల వెంకట్ , జిల్లా అధ్యక్షులు, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.
బైరెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం ఖాయమని, ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి పార్టీ విధానాలను వివరించాలని, ప్రతి కార్యకర్త ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, బోయల వెంకట్ మాట్లాడుతూ, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి క్రమశిక్షణతో పనిచేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎస్సీ వర్గాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పని చేయాలన్నారు.
ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ బాబు దిశానిర్దేశంతో ,జిల్లాలో ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా కమిటీ పనిచేయాలని అన్నారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలోరామవరంలోని అంబేద్కర్ కాలనీ సమీపంలో, గల పెద్దమ్మ గుడి (సమ్మక్క-సారక్క ) గద్దెల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నాయకులు సూచించారు.
అనంతరం ఎస్సీ మోర్చా జిల్లా కమిటీ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొని, పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ, జిల్లాలో ఎస్సీ మోర్చా బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కమిటీ సభ్యుల మధ్య సమన్వయం, ఐక్యత, స్నేహభావం మరింత పెంపొందించుకోవాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు , బోయల వెంకట్ , జిల్లా అధ్యక్షులు , బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ బాబుతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.