డ్రంకెన్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలు శిక్ష
దమ్మపేట,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో నలుగురు వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డాక్టర్ బి.భవాని గురువారం తీర్పు చెప్పారు. దమ్మపేట పోలీస్ స్టేషన్(Dammapeta Police Station) పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో(Drunken drive checks) మండలంలోని నల్లకుంట గ్రామానికి చెందిన మర్లపాటి అరుణకుమార్, సోదెం జగదీష్, కాకా నాగరాజు, ఊకె బాబురావు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
వీరిపై మోటారు వాహన చట్టం(Motor Vehicles Act) సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి బి. భవాని నిందితులు నలుగురికి ఒక్కొక్కరికి 2 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. అయితే నిందితులు జరిమానా చెల్లించకపోవడంతో అదనంగా మరో 2 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. దీంతో వీరు మొత్తం 4 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించనున్నారు. తీర్పు అనంతరం పోలీసులు నిందితులను సత్తుపల్లి సబ్జైలుకు తరలించారు.